చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, ముఖ్యమంత్రి హోదాలో విజయ్ మూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. అందులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళల రక్షణ కోసం సింగ పెన్ ప్రత్యేక దళం ఏర్పాటు, జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన చర్యలకు సంబంధించిన మూడు కీలక ఫైళ్లపై ఆయన సంతకం చేశారు.
తమిళనాడులో ప్రస్తుతం గృహ అవసరాలకు మొదటి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోంది. విజయ్ తన తొలి సంతకంతో ఆ పరిమితిని 200 యూనిట్లకు పెంచారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీని మొదటి రోజే అమలు చేశారు. దీని ప్రకారం, రెండు నెలలకు 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే గృహ వినియోగదారులకు, రెండు నెలలకు కలిపి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది.
మహిళల భద్రతను నిర్ధారించడానికి ప్రత్యేక రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినందున .. నివారణ , రక్షణ వ్యూహాలను ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుని పనిచేసేందుకు సింగ పెన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని నిర్మించడానికి సామాజిక రక్షకుల పథకం , పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ క్లబ్‌ల ఏర్పాటును టీవీకే మేనిఫెస్టోలో పొందుపరిచారు. దానికి అనుగుణంగా, డ్రగ్స్ సంబంధిత నేరాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు అన్ని నగరాలు , జిల్లాల్లో మాదకద్రవ్యాల నిరోధక విభాగాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
సీఎంగాప్రమాణం చేశానని ప్రధాన హామీల్లో అత్యంత ఖర్చయ్యే వాటిని ఆయన నెత్తిమీద వేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేస్తానని.. త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఖజానా ఖాళీగా ఉందన్నారు. విజయ్ ఇచ్చిన హామీలు అత్యంత ఖరీదైనవి. వాటిని అమలు చేయడానికి ఎంతో ఆర్థిక శక్తిని సాధించుకోవాల్సి ఉంది.


