వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి దూకుడు పెంచింది. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని పలు కీలక ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ లిక్కర్ సిండికేట్‌కు ప్రధాన సూత్రధారి, మాజీ ఐటీ సలహాదారు అయిన రాజ్ కేసిరెడ్డి తో పాటు ఆయనకు సహకరించిన మరికొందరు నిందితుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఏక్తా హైలాండ్ అపార్ట్మెంట్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి నివాసంలో ఈడీ బృందాలు లోతుగా తనిఖీలు చేపట్టాయి. వీటితో పాటు ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ డి. వాసుదేవ రెడ్డి నివాసం, కోకాపేటలోని ఆయన బంధువుల ఇళ్లు, ఈ సిండికేట్‌లో మధ్యవర్తులుగా వ్యవహరించిన వల్లు సందీప్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వంటి మొత్తం ఆరుగురు నిందితుల ఆస్తులపై దాడులు జరిగాయి. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో సుమారు రూ. 3,500 కోట్ల మేర లిక్కర్ కిక్బ్యాక్స్ వసూలు చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ఈడీ రూ. 441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
ఈ కేసులో గతంలోనూ ఈడీ పలుమార్లు సోదాలు నిర్వహించింది. సంగతి తెలిసిందే. ఆ తనిఖీల సమయంలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోని డిజిటల్ డేటా ఆధారంగా.. ఇటీవలే వైసిపి సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్ బషీర్‌బాగ్ ఆఫీసులో సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని, మద్యం విధానాల తాలూకు అన్ని ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు రాజ్ కేసిరెడ్డికే తెలుసని ఈడీకి చెప్పినట్లు వెల్లడించారు.
విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్, అంతకుముందు దొరికిన కీలక ఆధారాల లింకులను సరిపోల్చుకుంటూ ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగింది. మద్యం రవాణా టెండర్లను సిగ్మా సప్లై చైన్ , టెక్కర్ వంటి షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ మార్చారు? ఆ నిధులను రియల్ ఎస్టేట్, జ్యువెలరీ రంగాల్లోకి ఎలా మళ్లించారు? అనే కోణంలో కొత్త ఆధారాల కోసం ఈ తాజా సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో మరికొన్ని కీలక పత్రాలు, బినామీ పెట్టుబడుల వివరాలు లభ్యమైనట్లు తెలుస్తుండగా, రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఈ లిక్కర్ స్కామ్ మరింత సెగ రేపడం ఖాయంగా కనిపిస్తోంది.


