తమిళనాడు రాజకీయ చరిత్రలో స్టాలిన్ అత్యంత నమ్మకంగా విలువలు పాటించే నేతగా పేరు తెచ్చుకుంటున్నారు. రాజకీయ సంక్షోభంలో ఆయన అవకాశాల కోసం వెంపర్లాడటం లేదు. విలువలతో కూడిన రాజకీయాలే చేస్తున్నారు. ఒకవైపు అస్థిరత, మరోవైపు తెరవెనుక బేరసారాల నడుమ రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్లే ప్రమాదం కనిపించిన వేళ.. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అనుసరించిన వ్యూహం, ప్రదర్శించిన పరిణతి అందర్నీ ఆకట్టుకుంది. తనను, తన పార్టీని ఓడించి అధికారానికి దూరంచేసిన ప్రత్యర్థి విజయ్ పట్ల ఏమాత్రం అసహనం చూపకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో స్టాలిన్ పోషించిన పాత్ర ఆయనను ఒక స్టేట్స్‌మ్యాన్ గా నిలబెట్టింది.
అధికార దాహం కంటే విలువలకే పెద్దపీట
రాజకీయాల్లో అధికారం కోసం ఎంతటి అపవిత్ర పొత్తులకైనా సిద్ధపడే కాలమిది. ప్రతిపక్ష అన్నాడీఎంకేతో కలిస్తే తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉన్నప్పటికీ, స్టాలిన్ ఆ ప్రతిపాదనను కనీసం పరిశీలించకుండా తిరస్కరించడం ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి నిదర్శనంగా ప్రశంసలు దక్కుతున్నాయి. సిద్ధాంత వైరుధ్యం ఉన్న పార్టీలతో చేతులు కలిపి అధికారాన్ని పంచుకోవడం కంటే, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో కూర్చోవడమే గౌరవప్రదమని ఆయన భావించారు. ఈ నిర్ణయం ద్వారా డీఎంకే భవిష్యత్తును, ద్రవిడ సిద్ధాంత గౌరవాన్ని ఆయన కాపాడారు.
రాజ్యాంగ సంక్షోభానికి అడ్డుకట్ట
విజయ్ నేతృత్వంలోని టీవీకేకు స్పష్టమైన మెజారిటీ లేని సమయంలో, అన్నాడీఎంకే తన ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఇటువంటి క్లిష్ట సమయంలో స్టాలిన్ గనుక మౌనం వహించి ఉంటే, రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడి రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉండేది. కానీ, స్టాలిన్ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారు. తన మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలు, వీసీకేలను విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు మౌనంగీకారం తెలిపారు. ప్రభుత్వం ఏర్పడేలా చొరవ తీసుకుంటున్నారు. తద్వారా తమిళనాడులో ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా అడ్డుకున్నారని అనుకోవచ్చు.
గెలుపోటములకు అతీతంగా ఉన్నత వ్యక్తిత్వం
సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు ప్రత్యర్థిపై కక్షసాధింపు ధోరణిలో ఉంటారు. కానీ, స్టాలిన్ మాత్రం విజయ్ పట్ల ఎంతో హుందాగా వ్యవహరించారు. సినిమా గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చి తనను దెబ్బతీశారన్న కోపం కంటే, తమిళ ప్రజలు ఎంచుకున్న ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని గౌరవించడమే మిన్న అని ఆయన చాటి చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాస్వామ్య వ్యవస్థే గొప్పదని నిరూపించిన స్టాలిన్, ఈ సంక్షోభ సమయంలో తీసుకున్న నిర్ణయాలతో రాజకీయాల్లో నిలువెత్తు విలువల కు నిదర్శనంగా నిలిచారు.
అత్యధిక మార్కులు స్టాలిన్‌కే
ఈ మొత్తం రాజకీయ డ్రామాలో విజేతగా నిలిచింది విజయ్ కావొచ్చు కానీ, నైతికంగా అత్యధిక మార్కులు సాధించింది మాత్రం ఎం.కె. స్టాలిన్. ఎటువంటి కక్కుర్తి రాజకీయాలకు తావు ఇవ్వకుండా, రాజ్యాంగం పట్ల తనకున్న నిబద్ధతను ఆయన నిరూపించుకున్నారు. అధికారం చేజారినా, ఒక హుందాతనమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రవర్తన రాబోయే తరాల రాజకీయ నాయకులకు ఒక పాఠమని చెప్పుకుంటున్నారు.