హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గచ్చిబౌలిలో అత్యాధునిక ‘సాయి సింధు’ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం, ప్రధాని తన ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి కూటమి మిత్రపక్షాల నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నేరుగా మిత్రుల ఇళ్లకు వెళ్లి పలకరించడం అరుదైన విషయంగా భావిస్తున్నారు.
ముందుగా ప్రధాని మోదీ జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా పవన్ సైనస్ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. పవన్‌ను పరామర్శించడంతో పాటు, దాదాపు 20 నిమిషాల పాటు పన ఇంట్లో గడిపారు. కూటమి ప్రభుత్వంలో పవన్ పోషిస్తున్న పాత్రను, ఆయన పట్టుదలను ప్రధాని ఈ సందర్భంగా అభినందించినట్లు సమాచారం.
అనంతరం ప్రధాని మోదీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ ప్రధానికి ఘనస్వాగతం పలికారు. సుమారు గంటకుపైగా సేపు ప్రధాని మోదీ చంద్రబాబు నివాసంలో ఉన్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు కూడా పవన్ నివాసానికి ప్రధానితో కలిసి వెళ్లడం ద్వారా కూటమిలో ఉన్న ఐక్యతను చాటిచెప్పారు.
పవన్, చంద్రబాబు నివాసాలకు ప్రధాని మోదీ వెళ్తారన్నదానిపై అధికారిక షెడ్యూల్ లేదు. పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా ఉంచారు. మోదీ కేవలం రాజకీయ బంధాలే కాకుండా, వ్యక్తిగత అనుబంధాలకు తాము ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ఈ పర్యటనతో స్పష్టమైంది.
