రాజకీయం అంటే ఎదురుగా వస్తే ముఖం తిప్పేసుకోవాల్సిన అవసరం లేదని..రాజకీయంగా ఆత్మీయంగా ఫైట్ చేయవచ్చని రేవంత్ మరోసారి చూపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హెచ్ఐసీసీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ప్రధాని మోదీకి విజ్ఞకప్తులు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విభేదాలు పక్కనబెట్టి ప్రధానిని పెద్దన్న గా సంబోధిస్తూ రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులు అందరినీ ఆకర్షించాయి. ఎన్నికల సమయం ముగిసినందున ఇప్పుడు రాజకీయం కంటే అభివృద్ధిపైనే దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రగతికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలని రేవంత్ కోరారు.
గతంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ రాష్ట్రాలకు ఎలాగైతే సహాయ సహకారాలు అందించారో, అప్పట్లో గుజరాత్‌కు ఎలా సాయం చేశారో ఇప్పుడు మీరు కూడా అదే రీతిలో పెద్ద మనసుతో తెలంగాణను ఆదుకోవాలి అని కోరారు. ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణకు కేంద్ర మద్దతు అవసరమని నొక్కి చెప్పారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని, ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు వరకు రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని ఆయన ప్రధానికి నివేదించారు.
రేవంత్ రెడ్డి విజ్ఞప్తులకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో కౌంటర్లు ఇవ్వకుండా ఉండలేదు. మన్మోహన్ సింగ్ .. తాను ప్రధానిగా ఉన్న సమయంలో గుజరాత్ కు చేసినట్లుగా సాయం చేస్తే.. ఇప్పుడు ఇస్తున్న దాంట్లో పది శాతం కూడా రావన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైల్వేలకు వెయ్యికోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏ రాష్ట్ర అభివృద్ధిని కూడా రాజకీయ కోణంలో చూడబోమని, తెలంగాణలోని మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందుతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా సాయం అడగడంలో రేవంత్ రెడ్డి చూపిన పరిణతిని, అభివృద్ధి పట్ల ఆయనకున్న పట్టుదలను ప్రధాని అభినందించారు.
పర్యటనలో ప్రధాని మోదీ, రేవంత్ తో సరదాగా మాట్లాడారు. అభివృద్ధి విషయంలో కలసి నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ పర్యటన.. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో.. దానికిపూర్తి రివర్స్ లో సాగింది. మోదీపర్యటనలో అసలు కేసీఆర్ పాల్గొనేవారు కాదు. కానీరేవంత్ మాత్రం.. రాజకీయ సభకు తప్ప అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.


