తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, గత డీఎంకే ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ధీటుగా స్పందించారు. విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే, పాలనలో వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విజయ్ చేసిన ఖజానా ఖాళీ అయ్యింది అన్న వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని ఇప్పుడే చెప్పడం సరికాదని, ప్రజలకు ఇవ్వాలనే మనసు, పాలించే నైపుణ్యం ఉంటే నిధులు అవే వస్తాయని స్టాలిన్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో కరోనా కష్టాలు, వరదలు , కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఎదురైన సహాయ నిరాకరణ వంటి అనేక సవాళ్లను అధిగమించి తాము లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. తమ హయాంలో అప్పులు పెరిగాయన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ, తమిళనాడు రుణాల స్థాయి అనుమతించిన పరిమితుల్లోనే ఉందని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి బడ్జెట్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తాము స్పష్టంగా వివరించామని, ఆ విషయాలు తెలిసి కూడా విజయ్ ప్రజలకు హామీలు ఇచ్చారా అని స్టాలిన్ ప్రశ్నించారు. కేవలం సాధ్యమయ్యే హామీలనే ఇస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన విజయ్, ఇప్పుడు మాట మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకుండా, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వ పరిపాలనలోకి ఇప్పుడే అడుగుపెట్టిన విజయ్, రాబోయే రోజుల్లో పాలనలోని లోతుపాతులను, హామీలను నెరవేర్చడంలో ఎదురయ్యే సవాళ్లను తప్పకుండా నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, తమిళనాడు అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
