విజయ్ సాధించిన అటూ ఇటూ కాని విజయాన్ని చూపించి చాలా మంది రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ ఆలోచనలు లేని హీరోలందరికీ ముడిపెట్టి నెక్ట్స్ ఆయనే అంటున్నారు. అందరూ వాతలు పెట్టుకోవాలన్నట్లుగా సీన్ ఉంది. రాజకీయాలంటే అంత ఈజీ కాదనే విషయం అందరికీ తెలుసు. అదేదో ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఇరవై నాలుగు గంటలూ జనాల్లో ఉండాల్సిన వృత్తి మాత్రమే కాదు.. ఎన్నో మాటలు పడాలి.. ఎంతో నిబ్బరంగా ఉండాలి. అయినా ఇప్పుడు తెలుగు హీరోలు ఎవరైనా రాజకీయాల్లో చేతులు పెట్టడానికి రెడీగా ఉంటారా..?
విజయ్ ను చూసి వాతలు పెట్టుకోవాలంటున్న సోషల్ సలహాదారులు
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడం రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. విజయ్ సాధించిన ఈ అటూ ఇటూ కాని విజయాన్ని చూపిస్తూ, సోషల్ మీడియాలో కొంతమంది ఉత్సాహవంతులు తెలుగు హీరోల పేర్లను కూడా రాజకీయ తెరపైకి తెస్తున్నారు. విజయ్ సాధించినప్పుడు మన హీరోలు ఎందుకు సాధించలేరు అన్నది వారి ప్రధాన ప్రశ్న. సినిమా షూటింగ్‌ల మధ్య ఖాళీ దొరికినప్పుడు ట్వీట్లు వేయడం లేదా ఎన్నికల ముందు యాత్రలు చేయడం రాజకీయ పరిపక్వత అనిపించుకోదు. రాజకీయం అనేది 24 గంటల పూర్తిస్థాయి వృత్తి. ఇక్కడ గ్లామర్ కంటే ఓర్పు, సహనం , ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ముఖ్యం. ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయ పరిస్థితులు వేరు, నేటి సామాజిక సమీకరణాలు వేరు. ఇప్పుడు ఓటరు చాలా చైతన్యవంతుడయ్యాడు. కేవలం స్క్రీన్ మీద కనిపించే హీరోని చూసి ఓటు వేసే రోజులు పోయాయని, పవన్ కళ్యాణ్ పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాతే ప్రస్తుత స్థాయికి చేరుకున్నారనే విషయాన్ని ఇక్కడ ఎవరూ గమనించడంలేదు.
టాలీవుడ్ టాప్ హీరోలు – ఎవరి దారి వారిదే
తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత అగ్ర హీరోలైన మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ప్రస్తుతం తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. పాన్ ఇండియా ఇమేజ్‌తో కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న వీరు.. ఇప్పుడప్పుడే రాజకీయాల వైపు అడుగు వేసే అవకాశం లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పుడూ చర్చ జరుగుతున్నా, ఆయన ప్రస్తుతానికి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి వంటి దిగ్గజమే రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు విరక్తి చెందడం చూసిన తర్వాత, ప్రస్తుత హీరోలు ఆ సాహసం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ – ఎంతో కోల్పోయారు!
విజయ్ విజయాన్ని చూసి రెచ్చిపోతున్న వారు పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించడం లేదు. ఆయన కేవలం స్టార్ హోదాతో గెలవలేదు. పదేళ్ల పాటు అవమానాలు భరించి, క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించి, ఓటమిని చవిచూసి నిలబడ్డారు. విజయ్ సాధించిన ఈ అసంపూర్ణ విజయం కూడా ఆయనకు ఐదేళ్ల పాటు ముళ్ల బాటే అవుతుంది. మైనార్టీ ప్రభుత్వంతో నెట్టుకురావడం, ద్రవిడ పార్టీల వ్యూహాలను తట్టుకోవడం సినిమాల్లో చేసినంత ఈజీ కాదని అందరికీ తెలుసు. ఈ కష్టనష్టాలన్నీ తెలిసిన మన హీరోలు అకస్మాత్తుగా రాజకీయాల్లోకి దూకుతారనుకోవడం అత్యాశే అవుతుంది.
సోషల్ మీడియా సలహాలు.. వాస్తవ పరిస్థితులు
సోషల్ మీడియాలో సలహాలిచ్చే కీబోర్డ్ వారియర్స్‌కు’ రాజకీయాలంటే కేవలం ఒక ఈవెంట్ లాంటిది. కానీ, రంగంలోకి దిగితేనే తెలుస్తుంది అక్కడ ఎన్ని మాటలు పడాలి, ఎన్ని విమర్శలు భరించాలి అనేది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కుల, ప్రాంతీయ సమీకరణాలు చాలా బలంగా ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టి నిలదొక్కుకోవడం అనేది ప్రస్తుత హీరోలెవరికీ సాధ్యపడే పని కాదు. విజయ్ గెలిచాడు కదా అని ప్రతి హీరో రాజకీయ పార్టీ పెడితే.. అది కేవలం ఓట్లను చీల్చడానికి తప్ప దేనికీ పనికిరాదు.
