పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాల ఏకఛత్రాధిపత్యం, త్రిపురలో ఇరవై ఏళ్ల పటిష్టమైన పాలన, కేరళలో ఐదు దశాబ్దాలుగా సాగుతున్న అధికార మార్పిడి సంప్రదాయం.. ఇవన్నీ ఇప్పుడు చరిత్ర పుటల్లో మిగిలిపోయిన జ్ఞాపకాలు మాత్రమే. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో ఒక చారిత్రక మార్పును సూచిస్తున్నాయి. వామపక్షాలకు చివరి ఆశాకిరణంగా ఉన్న కేరళలో కూడా పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో, భారత దేశ పటంలో ఎర్ర జెండా ఉనికి కేవలం కొన్ని పాకెట్లకే పరిమితమైపోయింది. కాలంతో పాటు మారకపోవడం, సిద్ధాంతాలకే పరిమితమై ప్రజాకాంక్షలను గుర్తించలేకపోవడమే ఈ పతనానికి ప్రధాన కారణం.
బెంగాల్ నుండి కేరళ వరకు పతన ప్రస్థానం
ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన లెఫ్ట్ పార్టీల పతనం ఒక క్రమపద్ధతిలో సాగింది. బెంగాల్లో 1977 నుండి 2011 వరకు 34 ఏళ్ల పాటు సాగిన జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్యల పాలన మమతా బెనర్జీ దెబ్బతో కుప్పకూలింది. 2021లో సున్నా సీట్లకు పడిపోయిన లెఫ్ట్, నేటి ఎన్నికల్లో కేవలం 4.4 శాతం ఓట్లతో ఒక్క సీటుతో నామమాత్రపు ఉనికికే పరిమితమైంది. త్రిపురలో 2018లో బీజేపీ సునామీకి పాతికేళ్ల కమ్యూనిస్టు కోట కూలిపోయింది. మళ్లీ కోలుకున్న సూచనలు లేవు. ఇప్పుడు కేరళలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 100కు పైగా సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోగా, సీపీఎం కేవలం 25 సీట్లకే పరిమితమవ్వడం ఆ పార్టీ పతనానికి పరాకాష్ట. ఆ స్పేస్ ను ఆక్రమించడానికి బీజేపీ రెడీ అయిపోయింది.
వారసత్వ రాజకీయాల కంటే ప్రమాదకరమైన మొండితనం
లెఫ్ట్ పార్టీలు సిద్ధాంతపరంగా రాటుదేలినవే కావచ్చు, కానీ మారుతున్న ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల వేగాన్ని అందుకోవడంలో అవి విఫలమయ్యాయి. పారిశ్రామికీకరణ విషయంలో బెంగాల్లో సింగూరు, నందిగ్రామ్ ఉదంతాలు ఎంతటి నష్టాన్ని చేకూర్చాయో అందరికీ తెలిసిందే. అటు కేరళలో కూడా పినరయి విజయన్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అహంకారపూరిత ధోరణి ఆ పార్టీని ప్రజలకు దూరం చేశాయి. దశాబ్దాలుగా ఒకే తరహా పాతకాలపు నినాదాలతో యువతను ఆకట్టుకోలేకపోవడం, మారుతున్న టెక్నాలజీ, డిజిటల్ రాజకీయాలను అందిపుచ్చుకోకపోవడం వారిని కాలగర్భంలోకి నెట్టేసింది.
జాతీయ స్థాయిలో ఇక ఎవరూ పట్టించుకోరు!
1999, 2004 లోక్సభ ఎన్నికల్లో 50కి పైగా సీట్లు సాధించి, యూపీఏ ప్రభుత్వం పడిపోకుండా కాపాడిన కింగ్ మేకర్లుగా ఉన్న లెఫ్ట్ పార్టీలు, 2024 నాటికి కేవలం 4 సీట్లకే పరిమితమయ్యాయి. ఇప్పుడు కేరళను కూడా కోల్పోవడంతో, పార్లమెంట్లో వారి గళం మరింత బలహీనపడనుంది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ హోదాను కాపాడుకోవడం కూడా ఇప్పుడు ఆ పార్టీలకు అతిపెద్ద సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా బీజేపీ హిందూత్వ అజెండా, ప్రాంతీయ పార్టీల సోషల్ ఇంజనీరింగ్ మధ్య లెఫ్ట్ పార్టీల వర్గ పోరాటం సిద్ధాంతం ఆదరణ కోల్పోయింది.
యువతకు దూరమైన ఎర్ర జెండా
నేటి యువతకు ఉపాధి, అభివృద్ధి, డిజిటల్ అవకాశాలు కావాలి. కానీ లెఫ్ట్ పార్టీలు ఇంకా 1970ల నాటి కార్మిక సంఘాల రాజకీయం, ప్రైవేటీకరణను వ్యతిరేకించడం వంటి పాత పద్ధతులనే నమ్ముకున్నాయి. అటు బెంగాల్లో టీఎంసీ, బీజేపీల మధ్య జరిగిన పోరులో లెఫ్ట్ ఓటర్లు సహజంగానే బలమైన ప్రత్యామ్నాయం వైపు మళ్ళిపోయారు. కేరళలో కూడా యువ ఓటర్లు వామపక్షాల కంటే కాంగ్రెస్ , అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకున్న ఇతర శక్తుల వైపు మొగ్గు చూపారు. లెఫ్ట్ పార్టీలు ఒకప్పుడు భారత రాజకీయాలకు ‘నైతిక దిక్సూచి’గా ఉండేవి. కానీ, అవి కాలంతో పాటు తమను తాము పునర్నిర్మించుకోవడంలో విఫలమయ్యాయి.
