తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే మంచి ఫలితాలు సాధించగానే సోషల్ మీడియాలో మేధావుల జాతర మొదలైంది. అసలే ఎన్నికల రిజల్ట్స్ అంటే చాలు, పనీపాటా లేని గాలివాటం స్ట్రాటజిస్టులందరూ అకౌంట్ల నుంచి బయటకు వచ్చి.. అపర చాణక్యుల్లా ఫీలవుతుంటారు. విజయ్ గెలిచాడు కాబట్టి.. పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్నే ఇలా చేయాలి , చంద్రబాబు తన వ్యూహం మార్చుకోవాలి , చిరంజీవి అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది , మోదీ ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి అంటూ.. ఉచిత సలహాల వర్షం కురిపిస్తున్నారు. వీళ్ల రేంజ్ చూస్తుంటే, ఏదో వైట్ హౌస్లో కూర్చుని ప్రపంచాన్ని శాసిస్తున్నారేమో అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం.
పనీపాటా లేని వాళ్ల ఉచిత సలహాలు
నిజానికి, సోషల్ మీడియాలో ఈ గంటా స్ట్రాటజిస్టుల గోల భరించడం సామాన్యుల వల్ల కావడం లేదు. తమ సొంత జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఇంటికి కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి సరైన ప్లాన్ లేని వాళ్ళు కూడా.. ఏకంగా పదేళ్ల విజన్ ఉన్న రాజకీయ నేతలకు పాఠాలు చెప్పేస్తున్నారు. విజయ్ ఒంటరిగా వెళ్ళాడు కాబట్టే గెలిచాడు.. ఏపీలో కూడా అందరూ ఒంటరిగానే వెళ్ళాలి అని ఒకడంటే.. కాదు కాదు, ఇది కేవలం సినిమా గ్లామర్ అని ఇంకొకడు. అసలు ఆయా రాష్ట్రాల పరిస్థితులు, కుల సమీకరణాలు, రాజకీయ శూన్యత వంటి ప్రాథమిక అంశాల మీద కనీస అవగాహన లేకుండా.. కీబోర్డ్ దొరికింది కదా అని అడ్డగోలుగా వాయించేస్తున్నారు.
నేతలకు రాజకీయాలు నేర్పుతారా?
రాజకీయ నేతలు తమ రాజకీయాలు ఎలా చేయాలో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో వాళ్లకు బాగా తెలుసు. ఒకవేళ వాళ్లు తప్పు చేస్తే, ఆ ఫలితాన్ని కూడా వాళ్లే అనుభవిస్తారు. కానీ, ఈ సోషల్ మీడియా వీరులకే అది అర్థం కాదు. టీవీలో రిజల్ట్స్ చూస్తూ, చేతిలో ఫోన్ పట్టుకుని.. నేను ముందే చెప్పా కదా అని ఒక బిల్డప్. వీళ్లు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే.. కోహ్లీకి బ్యాటింగ్ ఎలా చేయాలో గల్లీ క్రికెట్ ఆడేవాడు సలహా ఇచ్చినట్టు ఉంటుంది. ఆయా నేతల కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు, రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వాళ్ళని ఉద్దేశించి నువ్వు వేస్ట్.. నా మాట విను అని రెచ్చిపోవడం ఈ డిజిటల్ యుగం మనకు ప్రసాదించిన వింతైన శాపం.
అందరూ స్ట్రాటజిస్టులే
తమిళనాడులో విజయ్ సాధించిన విజయం ఆయన కష్టం, అక్కడి ప్రజల ఆకాంక్ష. దాన్ని పట్టుకుని మిగిలిన రాష్ట్రాల్లోని నేతలకు ముడిపెట్టడం, వారికి అనవసరమైన మార్గదర్శకాలు జారీ చేయడం చూస్తుంటే.. అతి సర్వత్ర వర్జయేత్ అన్న సామెత గుర్తొస్తుంది. ఈ గాలి మేధావుల వల్ల నేతలకు వచ్చే లాభం ఏమీ లేదు కానీ, ఫాలోవర్లకు మాత్రం బుర్ర పాడవుతుంది. కాబట్టి, నాయకులు తమ పని తాము చేసుకుపోతారు.. ఈ సలహాదారులు మాత్రం తమ స్ట్రాటజీలను కనీసం తమ ఆఫీసులో ప్రమోషన్ తెచ్చుకోవడానికైనా వాడుకుంటే బాగుంటుందేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా, రిజల్ట్స్ వచ్చినప్పుడు గెలిచిన వాడి కంటే.. ఈ స్ట్రాటజీ లు చెప్పే వాళ్ళే ఎక్కువ ఆయాసపడిపోవడం ఈ కాలపు విడ్డూరం!
