పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి అతిపెద్ద అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిన్నమొన్నటి వరకు దీదీ తర్వాత తనే సర్వస్వం అన్నట్లుగా చెలామణి అయిన ఆమె మేనల్లుడు, పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ.. ఇప్పుడు పార్టీని నిలువునా ముంచేసే ప్రధాన మైనస్‌గా మారారు. ఎన్నికల పరాజయం తర్వాత, అభిషేక్ బెనర్జీ ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు భరించలేక మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తిరుగుబాటు జెండా ఎగురవేయడం కోల్‌కతా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
మమతా బెనర్జీ పార్టీ నుంచి బహిష్కరించిన ఎమ్మెల్యే విపక్ష నేత
శాసనసభా పక్ష నేత నియామకం కోసం స్పీకర్‌కు పంపిన లేఖలో తమ సంతకాలను అభిషేక్ బెనర్జీ వర్గం ఫోర్జరీ చేసిందని ఇద్దరు ఎమ్మెల్యేలు నేరుగా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు వెనుక బీజేపీ సీఎం సువేందు అధికారి హస్తం ఉందంటూ ఆగ్రహించిన మమతా బెనర్జీ.. వీరిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, ఈ బహిష్కరణే మమత కోటను బద్దలు కొట్టే ఆయుధంగా మారింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ, రిబ్రత బెనర్జీ ఊహించని విధంగా ఏకంగా 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో స్పీకర్ రతీంద్రనాథ్ బోస్‌ను కలిశారు. టీఎంసీకి ఉన్న మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ముప్పు నుంచి తప్పించుకుంటూ తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ శాసనసభా పక్షం అని నిరూపించుకున్నారు. ఫలితంగా, స్పీకర్ కూడా రిబ్రత బెనర్జీని అధికారికంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సి వచ్చింది.
సీనియర్లలో రగిలిన అసంతృప్తి
దీనంతటికి కారణం అభిషేక్ బెనర్జీనే. మమతా బెనర్జీ తన వారసుడిగా అభిషేక్ బెనర్జీని పార్టీలో ఒక రేంజ్లో ప్రమోట్ చేశారు. పార్టీ కేడర్‌పై, టికెట్ల కేటాయింపులపై, చివరకు శాసనసభా పక్ష నిర్ణయాలపై కూడా పూర్తి అధికారాన్ని అభిషేక్‌కే అప్పగించారు. అయితే, ఇదే ఇప్పుడు మమతకు శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్ నేతలను కరివేపాకులా తీసిపారేస్తూ అభిషేక్ నడిపిన శైలి.. పార్టీలోనే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా సీనియర్లను కాదని, తన అస్మదీయుడైన శోవన్ దేబ్ చటోపాధ్యాయను బలవంతంగా శాసనసభా పక్ష నేత గా రుద్దేందుకు అభిషేక్ ప్రయత్నించడం ఈ తిరుగుబాటుకు ఆజ్యం పోసింది.
కుప్పకూలుతున్న దీదీ సామ్రాజ్యం
మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడు, కోల్‌కతా మేయర్ అయిన ఫిర్హాద్ హకీమ్ సైతం తన పదవికి రాజీనామా చేయడంతో టీఎంసీ పతనం వేగవంతమైంది. ఒకప్పుడు మహారాష్ట్రలో శివసేనను ఏక్నాథ్ షిండే ఎలాగైతే చీల్చారో, ఇప్పుడు బెంగాల్లో రిబ్రత బెనర్జీ అదే తరహా వ్యూహాన్ని అమలు చేశారు. ఎమ్మెల్యేలంతా పార్టీ వీడటానికి, తిరుగుబాటు చేయడానికి బహిరంగంగా చెబుతున్న ఒకే ఒక్క కారణం— అభిషేక్ బెనర్జీ అహంకారం, వారసత్వ పెత్తనం. ఏ మేనల్లుడిని చూసి మమత మురిసిపోయారో, అదే మేనల్లుడు ఇప్పుడు పార్టీని ముక్కలు ముక్కలు చేయడానికి కారణమయ్యాడని స్పష్టమవుతోంది.
రిబ్రత బెనర్జీ నడిపిన ఈ తిరుగుబాటు వెనుక కేంద్రంలోని లేదా రాష్ట్రంలోని బీజేపీ శక్తుల అండ ఉందనేది బహిరంగ రహస్యమైనప్పటికీ, దానికి పునాది వేసింది మాత్రం అభిషేక్ బెనర్జీయే. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం న్యాయపోరాటాలకు దారితీసినా, నైతికంగా మమతా బెనర్జీ రాజకీయ ఇమేజ్ ఘోరంగా దెబ్బతిన్నట్లే .


