కేరళ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. అయితే, ఈ చారిత్రాత్మక గెలుపు తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ హైకమాండ్‌కు సవాలుగా మారింది. రాష్ట్రంలో పార్టీని సమర్థవంతంగా నడిపించిన ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్, హైకమాండ్‌కు అత్యంత సన్నిహితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
కాంగ్రెస్ కు ఉన్న ఓ అలవాటు ఏమిటంటే.. జనాల్లో కష్టపడి.., పార్టీని గెలిపించిన నేతను కాకుండా.. తమకు దగ్గరగా ఉండేవారికి పదవులు ఇవ్వడం. గత కొన్నేళ్లుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎండగట్టిన ఘనత సతీశన్‌కు ఉంది. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్యాడర్‌ను ఏకం చేసి, ఈ భారీ విజయానికి బాటలు వేశారు. పదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడిన ఆయనకే సీఎం పదవి దక్కాలని కేరళలోని ఒక వర్గం గట్టిగా కోరుతోంది.
అయితే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ పేరు కూడా వినిపిసస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉన్న వేణుగోపాల్, రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తుడు. కేరళలో ఆయన పార్టీ కోసం చేసిందేమీ లేదు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన, ఇప్పుడు కేరళ రాజకీయాల్లోకి తిరిగి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని ఆసక్తి చూపుతున్నారు. హైకమాండ్ అండదండలు ఉండటంతో ఆయన పేరు రేసులో బలంగా వినిపిస్తోంది.
వీరిద్దరితో పాటు మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల కూడా ఈ రేసులో ఉన్నారు. సీనియర్ నేతగా తనకూ అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం కోరుతోంది. కూటమిలోని ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తకుండా సమన్వయంతో ఒకరిని ఎంపిక చేయడం ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న అసలైన పరీక్ష.
