వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల్లో జరిగిన భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయల పనులు కట్టబెట్టడంపై రాష్ట్ర విజిలెన్స్ , ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమగ్ర విచారణ ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జనరల్‌కు విజిలెన్స్ విభాగం లేఖ రాసింది.
గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన గ్రామీణ రోడ్ల పనుల్లో సింహభాగం పీఎల్ఆర్ సంస్థకే దక్కాయి. మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, మౌఖిక ఆదేశాల ద్వారా ఇతర కాంట్రాక్టర్లను టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 21 ప్యాకేజీల కింద సుమారు రూ. 1,300 కోట్ల విలువైన 1,200 రహదారుల పనులు మంజూరు కాగా, అందులో రూ. 1,000 కోట్ల విలువైన 1,100 రోడ్ల పనులు ఒక్క పీఎల్ఆర్ సంస్థకే కట్టబెట్టారు. ఈ వ్యవహారంపై గత నెలలో హైకోర్టు న్యాయవాది ప్రసాద్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించలేదని, కేవలం ఒకే సంస్థకు లబ్ధి చేకూర్చేలా అధికారులు వ్యవహరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదే భయంలో పనుల నాణ్యతలోనూ తీవ్ర లోపాలు ఉన్నాయని, రోడ్లు వేయకుండానే బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన ప్రభుత్వం, ప్రజాధనం దుర్వినియోగంపై క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా పీఎల్ఆర్ సంస్థకు కేటాయించిన పనుల ఫైళ్లు, టెండర్ ప్రక్రియను విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అప్పట్లో పనిచేసిన కొందరు పంచాయతీరాజ్ ఇంజినీర్లు పెద్దిరెడ్డి కుటుంబ సంస్థకు అనుకూలంగా వ్యవహరించినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఈ అక్రమాల్లో భాగస్వాములైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే అటవీ భూముల ఆక్రమణ, బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డి కుటుంబంపై విచారణ జరుగుతోంది. దాదాపుగా రెండేళ్లు గడుస్తున్నా వాటిలో చర్యలు ఆయన వరకూ రాలేదు. ఈ రోడ్లపై విజిలెన్స్ విచారణలో వాస్తవాలు తేల్చాలంటే.. రోజుల్లోనే పూర్తి చేయవచ్చు.కానీ పెద్దిరెడ్డి లక్కేమిటో కానీ.. ఆయన సేఫ్‌గానే ఉన్నారు. లిక్కర్ స్కాంలో మాత్రం మిథునం రెడ్డి జైలుకెళ్లి వచ్చారు.
