తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించినా, ఆయన ముందున్నది పూలబాట కాదు, అత్యంత క్లిష్టమైన ముళ్లబాట అని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 234 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల వద్ద ఆగిపోయింది. అంటే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి ఇంకా 10 స్థానాల లోటు ఉంది. రెండు చోట్ల గెలిచిన విజయ్.. ఓ చోట రాజీనామా చేయాలి. అంటే మరో సీటు తగ్గిపోతుంది.
అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించిన విజయ్‌కు గవర్నర్ అవకాశం ఇచ్చినప్పటికీ, మైనార్టీ ప్రభుత్వాన్ని నడపడం ఆయనకు ఒక అగ్నిపరీక్షే కానుంది.
ద్రవిడ పార్టీల వ్యూహాత్మక’ వెనకడుగు
విజయ్ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడం డీఎంకే , అన్నాడీఎంకేలకు కలిసి వచ్చే అంశం. అయితే ఆయన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం మాత్రం చేయరు. అలా ప్రయత్నిస్తే ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని ఆ పార్టీల వ్యూహకర్తలు భావిస్తారు. అందుకే, వారు ప్రస్తుతానికి విజయ్‌కు మార్గం సుగమం చేస్తూనే, తెరవెనుక ఒక బలమైన రాజకీయాన్ని మొదలుపెడతారు. పాలనలో విజయ్ ఏమాత్రం తడబడినా, ఆ వైఫల్యాన్ని అస్త్రంగా మార్చుకుని రెండేళ్లలోనే ఆయనను ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టడం వీరి ప్రాథమిక లక్ష్యం.
రెండేళ్ల టైమ్ బాంబ్ – జమిలి ఎన్నికల ముప్పు
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికల అంశం ఇప్పుడు విజయ్ మెడపై వేలాడుతున్న కత్తిలా మారింది. ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచేలా చేసి.. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ద్రవిడ పార్టీలు రెడీగా ఉంటాయి. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలా రాజ్యాంగ సవరణ జరిగితే, విజయ్ ప్రభుత్వం గడువును కూడా పూర్తి చేసేస్తాయి ఈ ద్రవిడపార్టీలు. అప్పటికి ప్రజల్లో విజయ్ పై ఓ ముద్ర వేసేస్తాయి. ద్రవిడ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ జమిలి ఎన్నికలను ఒక ఆయుధంగా వాడుకోనున్నాయి. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల నాటికే విజయ్ పాలనపై ప్రజల్లో విరక్తి పుట్టించే ప్లానూ మలు చేస్తారు.
పరిపాలనా దక్షతకు అగ్నిపరీక్ష
విజయ్ ఒక నటుడిగా సినిమాల్లో అద్భుతాలు చేసి ఉండవచ్చు, కానీ వాస్తవ పరిపాలనలో బ్యూరోక్రసీ ని మేనేజ్ చేయడం, ఆర్థిక వనరులను సమీకరించడం అత్యంత క్లిష్టమైన పనులు. ఆయన ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో చిన్నవి కాదు. ముఖ్యంగా డీఎంకే కాలం నాటి వ్యవస్థలను మార్చి, తనదైన మార్కు పాలన అందించాలంటే విజయ్‌కు అసాధారణమైన పట్టు ఉండాలి. డీఎంకే, అన్నాడీఎంకేలు క్షేత్రస్థాయిలో ఉన్న తమ క్యాడర్ ద్వారా ప్రభుత్వ పథకాల అమలులో ఆటంకాలు సృష్టించడం, చిన్న సమస్యను కూడా పెద్దదిగా చూపించడం ద్వారా విజయ్ను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది.
మద్దతుదారుల అగమ్యగోచర స్థితి
మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ ఇప్పుడు కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలు లేదా స్వతంత్రులపై ఆధారపడాల్సి ఉంటుంది. మద్దతు ఇచ్చిన పార్టీలు తమ ప్రయోజనాల కోసం బ్లాక్ మెయిల్ రాజకీయాలు మొదలుపెడితే, విజయ్ సొంత నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఈ అస్థిరతను చూపిస్తూ.. ఒక నటుడికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది అని ద్రవిడ పార్టీలు ప్రచారం చేస్తాయి. ప్రజల్లో కలిగే ఈ అసహనమే మళ్ళీ ద్రవిడ పార్టీల పునరుజ్జీవానికి దారి తీస్తుంది.
