ఈ వేసవిలో రాబోతున్న సినిమాల్లో ‘స్వయంభూ’ ఒకటి. నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. ‘కార్తికేయ 2’ ఘన విజయాన్ని అందుకొన్న తరవాత నిర్మాతలకు నిఖిల్ పై నమ్మకం మరింత పెరిగింది. భారీ బడ్జెట్ లు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ‘స్వయంభూ’ పై కూడా నిర్మాత గట్టిగా ఖర్చు పెట్టారు.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘రారా ధీవర’ అంటూ సాగే ఈ పాట హీరో క్యారెక్టరైజేషన్నీ, తన తెగువనీ, ధైర్యాన్నీ తెలియజేస్తోంది. వందలమంది డాన్సర్లతో ఈ పాటని కలర్ ఫుల్ గా తీశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. సంతోష్ వెంకీ గాత్రాన్ని అందించారు. పాట స్ఫూర్తి వంతంగా సాగింది. రామజోగయ్య సాహిత్యంలో
”నువ్వే నీ ఉలి.. నువ్వే నీ శిల
నీలో శక్తిని.. శిల్పంగా మార్చరా”
”నీ దీక్షలోన చిందుతున్న స్వేదమూ వీర గంధమే
నీ శక్తి దాటి పెంచుకొన్న శౌర్యమూ పాఠ్య గ్రంధమే” అనే పంక్తులు మెరిశాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వదిలారు. ఆ గ్లింప్స్ తో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. త్రీడీ వెర్షన్ కూడా రెడీ చేస్తున్నారు. త్రీడీలో యుద్ధ విన్యాసాలున్న ఈ కథ చూడడం మరో మంచి అనుభవం అని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.


