Papam Prathap Movie Review
తెలుగు360 రేటింగ్ : 2/5
కథానాయకుడి ఓ సమస్య ఆపాదించి, ఆ సమస్య చుట్టూ వినోదం నింపి, హిట్టు కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’… ఈ కోవకు చెందిన కథలే. ‘గజిని’లాంటి సినిమాలది మరో దారి. కాకపోతే.. ఈ సినిమాలన్నీ ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆ పాయింట్ ఎంత బలంగా ఉంటే అంత బలంగా సినిమా నిలబడుతుంది. సమస్య చుట్టూ ఎలాంటి ఎలిమెంట్స్ మిక్స్ చేశారన్నది కూడా ప్రధానమే. ఆ సమస్య తేలిపోయి, మిక్స్ చేసిన ఇతర అంశాలు కుదరక గాడి తప్పిన సినిమాలూ కొన్ని కనిపిస్తాయి. ఈ సింగిల్ పాయింట్ సినిమాల్లో సేఫ్టీ ఎంత ఉందో, రిస్క్ కూడా అంతే ఉందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ‘పాపం ప్రతాప్’ కూడా సింగిల్ పాయింట్ సినిమానే. మరి ఆ పాయింట్ చుట్టూ నింపిన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ప్రతాప్ సమస్యేంటి?
ప్రతాప్ (తిరువీర్)కి బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణన్) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచీ ప్రేమిస్తూనే ఉంటాడు. చివరికి పెళ్లి కూడా చేసుకొంటాడు. మూడు రాత్రుళ్లు బాగానే గడుస్తాయి. నాలుగో రోజు బుజ్జమ్మ ఆ ఊర్లో పంచాయితీ పెడుతుంది. ‘ప్రతాప్ తో కాపురం చేయలేను.. పుట్టింటికి వెళ్లిపోతాను’ అంటుంది. దానికి కారణం మాత్రం చెప్పదు. భార్య ఎందుకు వెళ్లిపోతుందో ప్రతాప్ కి కూడా తెలీదు. అదే అడిగితే… ‘సమస్య నీదే కాబట్టి.. నువ్వే సమస్యేంటో తెలుసుకొని, దాన్ని పరిష్కరించుకొని, అప్పుడు నన్ను పుట్టింటి నుంచి తీసుకెళ్లు’ అంటుంది. అప్పటి నుంచీ తన సమస్యేంటో తెలుసుకొనేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు ప్రతాప్. ఇంతకీ ప్రతాప్ సమస్యేంటి? అందులోంచి తాను బయటపడ్డాడా లేదా? అనేదే మిగిలిన కథ.
‘పాపం ప్రతాప్’ టీజర్, ట్రైలర్ లో కూడా ఇదే విషయం చెప్పారు. సమస్యేంటో రివీల్ చేస్తే.. థియేటర్లో చూసే ప్రేక్షకులకు ఆ కిక్ ఉండదు కాబట్టి.. దాన్ని హైడ్ చేయాల్సివస్తోంది.
ఇలాంటి ‘సమస్యాత్మక’ కథల్లో సమస్య ఒక్కటే. ఆ సమస్యేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ప్రేక్షకులకు తప్పకుండా వస్తుంది. అందులో ఎలాంటి అనుమానం ఉండదు. కానీ దాన్ని రివీల్ చేశాక ‘ఇంతేనా’ అనిపిస్తుంది. ఆ సమస్య తాలుకూ తీవ్రతని వినోదాత్మకంగానో, భావోద్వేగంగానో ట్రీట్ చేయడం తప్పని సరి. దర్శకుడు ఏదో ఓ మార్గాన్ని ఎంచుకోవాల్సిందే. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ సినిమాల్లో హీరోల సమస్యల్ని, వాళ్ల లోపాల్ని చాలా వినోదాత్మకంగా ట్రీట్ చేశారు. ‘గజిని’లో సీరియస్ గా చెప్పారు. కానీ ‘పాపం ప్రతాప్’ లో అటు సీరియస్ నెస్ లేదు. ఇటు కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. సమస్యేంటో దాచేసే వరకూ కథ ఓకే అనిపిస్తుంది. ఆ ప్రహసనంలో వచ్చే కామెడీ కూడా బిట్లు బిట్లుగా బాగుంటాయి. కాకపోతే.. పగలబడి నవ్వేంత సీన్ ఒక్క సీన్ కూడా ఇవ్వదు. షకీలా సీన్లు, ఇద్దరు మగ స్నేహితుల మధ్య ఏదో ఉందని ఊరంతా అనుమానించే సన్నివేశాల ద్వారా కామెడీ పిండుకోవాలన్న వృధా ప్రయత్నం చేశాడు దర్శకుడు. అజయ్ ఘోష్ కాస్త శ్రమించి నవ్వించే ప్రయత్నం చేయడం ద్వారా కాస్త రిలీఫ్ వచ్చింది. సమస్యని కూడా ఒక్కసారిగా చెప్పకుండా, పార్టులు పార్టులుగా చెప్పడం ద్వారా కాస్త ల్యాగ్ ఫీలింగ్ వచ్చినా, ఇంట్రవెల్ వరకూ పాయింట్ ని హోల్డ్ చేయగలిగారు.
సెకండాఫ్ లో సమస్యేంటో హీరోకి పూర్తిగా అర్థమైపోతుంది. అందులోంచి బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలు కొన్నిసార్లు నవ్విస్తాయి. ఇంకొన్నిసార్లు విసుగు పుట్టిస్తాయి. అవసరాల శ్రీనివాస్ ట్రాక్ అంత ప్రభావవంతంగా తెరపై తీసుకురాలేదు. ఊర్లో పంచాయితీ పెట్టి, వాళ్లందరి ముందూ తనకు సమస్య పోయిందని నిరూపించడానికి హీరో చేసే ప్రయత్నం కాస్త నవ్విస్తుంది. కాకపోతే.. అక్కడ కూడా ల్యాగ్ చాలా ఎక్కువ ఉంటుంది. హీరోని నిద్రబుచ్చడానికి ఊరంతా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ హీరోకేమో గానీ, ప్రేక్షకులకు మాత్రం మత్తుగా నిద్రొస్తుంది. ఈ సమస్యకంటూ ఓ పరిష్కారం కూడా ఉంది. కాకపోతే అది కూడా ‘తు.తు.. మంత్రం’గానే అపిపిస్తుంది. ‘ఇదేదో ముందే చేసేసి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు కదా’ అని కూడా అనిపిస్తుంది.
తిరువీర్ తనలోని విభిన్న కోణాలు ప్రదర్శించే అవకాశం ఈ ప్రతాప్ పాత్ర కల్పించింది. కాకపోతే తాను కామెడీ చేసినప్పటి కంటే, ఎమోషన్ పండించేటప్పుడే ఎక్కువ నచ్చుతాడు. హీరోయిన్ పాత్రలో చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. పాయల్ పాత్రని ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుంటే బాగుండేది అనిపిస్తుంది. అజయ్ ఘోష్ కాస్తలో కాస్త నిలబెట్టాడు. తనది రెగ్యులర్ నటనే అయినా, ఈ పాత్రకు సరిపోయింది. గోపరాజు రమణ క్యారెక్టర్, అతన్నుంచి పండించిన కామెడీ ఈటీవీ విన్ స్టాండర్డ్ కి తగ్గట్టుగా లేవని మాత్రం అనిపిస్తుంది. ప్రసాద్ బెహరా మాటలు అక్కడక్కడ కాస్త నచ్చుతాయి.
ఉన్నంతలో కాస్త క్వాలిటీ సినిమాల్ని తీసేందుకు ఈటీవీ విన్ ప్రయత్నిస్తోంది. కథకు తగ్గట్టుగానే క్వాలిటీ కనిపించింది. పాటలు `ఓకే` అనిపిస్తాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలైతే లేవు. సెకండాఫ్ లో ట్రిమ్ చేయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఫస్టాఫ్ లో అయితే అడల్ట్ ఫీలింగ్ వచ్చే సీన్లు మొత్తం తీసేయొచ్చు. దర్శకుడు హీరో సమస్య కంటే మిగిలిన విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అసలు సమస్య దగ్గరకు వచ్చేసరికి చేతులు ఎత్తేశాడు. మొత్తంగా చూస్తే.. అక్కడక్కడ కొన్ని నవ్వులు.. మధ్యమధ్యలో కాస్తంత ఎమోషన్ తో ప్రతాప్ పాపం అనిపిస్తాడు.
తెలుగు360 రేటింగ్ : 2/5
