సూర్య కుమార్ యాదవ్… అభిమానులు మిస్టర్ 360 అని ముద్దుగా పిలుచుకొంటారు. డివిలియర్స్ లా మైదానంలో అన్ని వైపులా ధాటిగా షాట్లు కొట్టడంలో దిట్ట. ఓ దశలో టీమ్ ఇండియా టీ20కి పెద్ద దిక్కుగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్.. కెరీర్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకొందా? అనిపిస్తోంది. రెండేళ్ల నుంచి సూర్య కుమార్ పేలవమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా.. టీమ్ ఇండియా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏసియన్ గేమ్స్ కోసం భారతజట్టుని ప్రకటించారు సెలక్టర్లు. వీటిలో ఎక్కడా సూర్య కుమార్ యాదవ్ పేరు కనిపించలేదు. కెప్టెన్ గానే కాదు, ఆటగాడిగానూ ఉద్వాసన పలికారు. దీంతో సూర్య కుమార్ యాదవ్ చాప్టర్ దాదాపుగా ముగిసినట్టే. ఎందుకంటే తనకు ఇప్పుడు 35 ఏళ్ల వయసు. కుర్రాళ్లతో పోటీ పడడం అసాధ్యం. మళ్లీ ఫామ్ లోకి వచ్చినా, టీమ్ ఇండియా జట్టులో చోటు సంపాదించుకోవడం చాలా కష్టం. సో… సూర్య కుమార్ ని ఇక బ్లూ జెర్సీలో చూడడం అసాధ్యమే.
సూర్య కుమార్ యాదవ్ జర్నీ చాలా ఆలస్యంగా మొదలైంది. ఐపీఎల్ లో హవా చూపించాక, 30 ఏళ్లకు టీమ్ ఇండియా నుంచి పిలుపు వచ్చింది. వచ్చిన కొత్తలో టీ20లో మెరుపులు మెరిపించేశాడు. సూర్య రాకతో మిడిల్ ఆర్డర్ బలోపేతం అయ్యింది. చివర్లో ధాటిగా పరుగులు సాధించి స్కోరు బోర్డుని ఉరకలెత్తించేవాడు. ఫామ్ లో ఉన్నప్పుడు తన స్ట్రయిక్ రేట్ 200 తగ్గేది కాదు. వరుసగా రెండేళ్లు నెంబర్ వన్ టీ20 ప్లేయర్ గా ఐసీసీ అవార్డులు అందుకొన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ వదులుకోవడంతో ఆ ఛాన్స్ సూర్యకు దక్కింది. కెప్టెన్ గా సూర్యకు తిరుగులేని రికార్డ్ ఉంది. తన హయాంలో ఒక్క టీ20 సిరీస్ కూడా కోల్పోలేదు. పైగా 2024 వరల్డ్ కప్ ని అదించాడు. అయితే ఆ తరవాత ఫామ్ అందుకోలేక తంటాడు పడుతున్నాడు. సెలెక్టర్లు కూడా తనకు చాలా అవకాశాలే ఇచ్చారు. కానీ.. వరుస వైఫల్యాలతో కెప్టెన్సీనే కాదు, ఇప్పుడు జట్టులో చోటు కూడా కోల్పోయాడు.
సూర్యని పక్కన పెట్టడంతో సెలక్టర్లు కచ్చితమైన సందేశాన్ని పంపగలిగారు. ఫామ్ లో లేకపోతే ఎంతటివాళ్లనైనా వదులుకొంటామని నేరుగా చెప్పే ప్రయత్నం ఇది. విరాట్, బుమ్రా లాంటి సీనియర్లకు కూడా ఇదే వర్తిస్తుంది.