బీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో అటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రవేశాన్ని, ఆయన చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన కవిత.. భూకబ్జాలు, తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది పవన్ కళ్యాణ్ తాతల జాగీరు కాదు!
తెలంగాణ అస్థిత్వాన్ని ప్రస్తావిస్తూ కవిత అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఇది బరాబర్ మా జాగీరే! 1,200 మంది అమరవీరుల త్యాగాలు, కడుపు కట్టుకుని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇక్కడి ప్రజల సొత్తు. ఇది పవన్ కళ్యాణ్ తాతల, ముత్తాతల జాగీరు కాదు” అని స్పష్టం చేశారు. ఆంధ్రాలో సొంతంగా రాజధాని కూడా కట్టుకోలేక, ఇక్కడికి వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పోటీ చేయవచ్చు కానీ, దానికి కనీస నైతికత ఉండాలని.. గతంలో వీరి వల్లే తెలంగాణ వనరులు దోచుకున్నారని విమర్శించారు.
‘కోడికుంట’ భూములు తిరిగిచ్చేయాలి!
పవన్ కళ్యాణ్‌కు చెందిన భూ వివాదాన్ని కవిత ఈ సందర్భంగా తెరపైకి తెచ్చారు. ‘కోడికుంట’ చెరువు పరిధిలో పవన్ కళ్యాణ్ కొన్న 10 ఎకరాల భూమి పూర్తిగా “శిఖం భూమి” అని ఇరిగేషన్ రికార్డులు స్పష్టంగా చెప్తున్నాయని వెల్లడించారు. “శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తానని పవన్ గతంలో అన్నారు.. మరి ఇప్పుడు ఆ మాటపై నిలబడి ఆ భూమిని వెంటనే ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ చెరువు భూముల్లో వేసిన కంచెను, పోసిన మట్టిని తక్షణమే తొలగించాలని అధికారులను కోరారు. బీజేపీకి తెలంగాణలో సొంతంగా నాయకులు లేకే, కేవలం రెండు ఓట్ల కోసం పవన్ కళ్యాణ్‌ను ఇక్కడికి తెచ్చి వాడుకుంటోందని ఎద్దేవా చేశారు.
ఫోక్ సింగర్స్ ట్యూన్లు కాపీ కొట్టి కోట్లు సంపాదించలేదా?
గతంలో ప్రజా గాయకుడు గద్దర్‌కు తాను కారు కొనిచ్చానంటూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకోవడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో గద్దర్ అన్నకు కారు కొనిచ్చానని ఇప్పుడు పవన్ గొప్పలు చెప్పుకోవడం ఏంటి? అసలు మీరు ఎంతమంది ఫోక్ సింగర్స్ ట్యూన్లను కాపీ చేసి మీ సినిమాల్లో పెట్టుకుని కోట్లు సంపాదించలేదు? ఆ ఫోక్ సింగర్స్‌ను గానీ, నష్టపోయిన చిన్న నిర్మాతలను గానీ మీరెప్పుడైనా ఆదుకున్నారా?” అంటూ కవిత ప్రశ్నించారు. తెలంగాణ కళలను కేవలం వ్యాపారానికి వాడుకున్నారే తప్ప, ఈ ప్రాంతంపై పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి నిజమైన ప్రేమ లేదన్నారు.
అప్పుడు.. ఇప్పుడు ‘కేటీఆర్’ పాలనే!
రాష్ట్రంలో గత , ప్రస్తుత పాలనను పోలుస్తూ ‘కేటీఆర్’ అనే మూడక్షరాలపై కవిత ఆసక్తికరమైన పొలిటికల్ పంచ్ వేశారు. “అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది, ఇప్పుడు కేటీఆర్ పాలనే నడుస్తోంది” అని వ్యాఖ్యానించారు. నాడు కేటీఆర్ అంటే.. కెసిఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు.. నేడు కేటీఆర్ అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. నాడు అభివృద్ధి కోసం ఆ ముగ్గురు కష్టపడితే, నేడు పాలనను తమ కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టి నడిపిస్తున్నారని కవిత విమర్శించారు. పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్, బీజేపీలు కలిసి పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టాయని ఆమె ఆరోపించారు.
