నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ వేదికగా పటాపంచలు చేశారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గకుండా ఉండేలా ప్రభుత్వం ఒక శాస్త్రీయమైన ఫార్ములాను రూపొందించిందని ఆయన వివరించారు. దీని ప్రకారం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం మేర పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఈ కొత్త ఫార్ములా అమలులోకి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి , తెలంగాణలో ఉన్న 17 స్థానాలు 26కు చేరుతాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా 13 సీట్లు, తెలంగాణకు 9 సీట్లు లభించనున్నాయి. తద్వారా కేంద్ర రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల గొంతుక మరింత బలంగా వినపడుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.
ఇక మిగిలిన దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 59కి, కర్ణాటకలో 28 సీట్లు 42కి, అలాగే కేరళలో ఉన్న 20 సీట్లు 30కి పెరగనున్నాయి. ఈ పెరుగుదల వల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత వాటా సుమారు 24 శాతం ఏమాత్రం తగ్గదని, కేవలం సభ్యుల సంఖ్య మాత్రమే పెరుగుతుందని ఆయన వివరించారు.
మొత్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుండి 816 లేదా అంతకంటే ఎక్కువకు పెంచడం ద్వారా అందరికీ సమన్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా, రాష్ట్రాల ఉనికి దెబ్బతినకుండా ఈ ఫ్లాట్ 50 శాతం పెంపుదల సూత్రాన్ని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
