ఓ పెద్ద సినిమా వస్తోందంటే బాక్సాఫీసు దగ్గర కళ మొదలవ్వడం ఎంత నిజమో… మిగిలిన సినిమాలు ‘సైలెంట్’ అయిపోవడం కూడా అంతే సహజం. రిలీజ్ కు ఓ వారం ముందూ, ఓ వారం వెనుక అసలేమాత్రం హడావుడి ఉండదు. ఆ సినిమా హిట్టయితే… మరో రెండు వారాల పాటు మిగిలిన సినిమాలు రావడానికి ధైర్యం చేయలేవు. ‘పెద్ది’ ఏప్రిల్ 30న వస్తుందని తెలిసి.. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు సైలెంట్ అయిపోయాయి. ఏప్రిల్ ఆఖరి వారంలో వద్దామనుకొన్న సినిమాలు తమ నిర్ణయం మార్చుకొన్నాయి.
తీరా చూస్తే పెద్ది రావడం లేదు. దాంతో ఆ సినిమాలకూ షాక్ తగిలింది. ‘పెద్ది’ నిర్మాతలు వాయిదా పడిన నిర్ణయం కాస్త ఆలస్యంగా చెప్పడంతో స్పందించే అవకాశమే లేకుండా పోయింది. ‘స్వయంభూ’, ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘ఎపిక్’, ‘వీసా’ లాంటి సినిమాలు ఏప్రిల్ 30ని టార్గెట్ చేద్దామనుకొన్నాయి. కానీ ఆఖరి నిమిషంలో వీలు కాలేదు. ఈ సినిమాలకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి. అవి హడావుడిగా ముగించి, సినిమాని విడుదల చేయడం ఇష్టం లేక, ఈ డేట్ ని వదులుకోవాల్సివచ్చింది. అదే సమయంలో ‘గాయపడ్డ సింహం’ కాస్త తెలివిగా ఆలోచించింది. ‘పెద్ది సినిమా రాదు’ అని ఫిక్సయిపోయి, ప్రమోషన్లు మొదలెట్టింది. సినిమా కూడా చేతిలో ఉంది. సో.. మే 1న సోలో రిలీజ్ దక్కించుకొంది. కొన్ని సినిమాలు మే1 న రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ.. అవేం పెద్దగా ఇంపాక్ట్ చూపించవని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది.
జూన్ లో ‘పెద్ది’ని రిలీజ్ చేస్తామంటున్నారు. కానీ.. డేట్ ఫిక్స్ చేయలేదు. దాంతో జూన్ లో వద్దామనుకొన్న సినిమాలన్నీ ఇప్పుడు డైలామాలో పడ్డాయి. అవన్నీ మేలో రావాలి. లేదంటే ‘పెద్ది’ వెళ్లేంత వరకూ ఎదురు చూడాలి.
