ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఒఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డిలు అరెస్ట్ కావడంతో తాడేపల్లి ప్యాలెస్ లో కలవరం మొదలైనట్లుగా తెలుస్తోంది.దీంతో ఈ కేసులో కింగ్ పిన్ ను కాపాడేందుకు ఆ పార్టీ నేతలు అప్పుడే కొత్త రాగం అందుకున్నారు.
నిన్నా, మొన్నటివరకు ఇక బీజేపీతో కలిసేదే లేదు అంటూ తెగేసి చెప్పిన వైసీపీ… లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ టోన్ మార్చేసింది. ప్రధానిని పొగుడుతూ, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అయినా ఇప్పుడే ఈ కామెంట్స్ ఎందుకు చేసి ఉంటారనే అనుమానం ఎవరికైనా ఇట్టే వస్తోంది. ఇదే పలు అనుమానాలను లేవనేత్తుతోంది.
లిక్కర్ కేసులో కింగ్ పిన్ అరెస్ట్ ఖాయమని అంచనాతోనే వైసీపీ నేత పొత్తు గురించి కామెంట్స్ చేసి ఉంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ పొత్తు గురించిన చర్చ ఇప్పుడే కీలక నేతల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తే లిక్కర్ కేసు భయమే ఈ వాదనను వినిపిస్తుందని జనాలూ ఇట్టే గ్రహించేస్తారు. అందుకే తెలివిగా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో ఈ కామెంట్స్ చేయించారని అంటున్నారు.
టీడీపీని కాదని వైసీపీతో బీజేపీ పొత్తుకు పెట్టుకుంటుందా? గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతు లేకపోతే బీజేపీ ఎంత నష్టపోయేదో ఆ పార్టీ అగ్రనాయకత్వానికి అర్థమైంది. అందుకే ఎన్డీయే కూటమిలో టీడీపీకి ఊహించని విధంగా ప్రాధాన్యత ఇస్తోంది. టీడీపీతో మున్ముందు పొత్తును కొనసాగించాలని బీజేపీ ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే వైసీపీ పంపిస్తున్న లవ్ సిగ్నల్స్ ను బీజేపీ యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు.
కాకపోతే.. ప్రసన్న చేసిన కామెంట్స్ ద్వారానైనా వైసీపీ, బీజేపీ పట్ల ఇంకా విధేయతతోనే ఉందని సంకేతాలు పంపించాలనేది ఆ పార్టీ ఉద్దేశంగా కనబడుతోంది. అదే సమయంలో,ఈ లిక్కర్ కేసును కింగ్ పిన్ వరకు రాకుండా చేసేందుకు టైం కానీ టైంలో పొత్తు వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.