తమిళనాడు రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉచిత హామీల వరద పారిస్తున్నారు. శనివారం మహాబలిపురంలో జరిగిన సభలో భారీ ఎన్నికల హామీలను ప్రకటించారు. ప్రధానంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల కంటే మెరుగైన ఆఫర్లను ఆయన తెరపైకి తెచ్చారు. కుటుంబ పెద్దలైన మహిళలకు నెలకు రూ. 2,500 సహాయం అందిస్తామని ప్రకటించారు.
అన్నపూర్ణి సూపర్ సిక్స్ పేరుతో ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం అన్న సారె అనే వినూత్న పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా పెళ్లి కుమార్తెకు పుట్టింటి కానుకగా ఒక తులం 8 గ్రాముల బంగారం, పట్టు వస్త్రాన్ని ప్రభుత్వం తరపున అందజేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో బడి మానేసే పిల్లలు సంఖ్యను సున్నాకు తగ్గించడమే లక్ష్యంగా కామరాజర్ విద్యా హక్కు పథకాన్ని విజయ్ ప్రకటించారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థి తల్లి లేదా సంరక్షకురాలికి ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. దీనితో పాటు మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రత కోసం తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తానని, వారి సంక్షేమమే తమ పార్టీ ప్రాథమిక సూత్రమని విజయ్ ఉద్ఘాటించారు.
ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ఇస్తున్న రూ. 1,000 సహాయాన్ని రూ. 2,500కు పెంచుతామని ప్రకటించడం ద్వారా విజయ్ నేరుగా మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఉచిత సిలిండర్లు, బంగారం వంటి హామీలతో తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.
