తెలంగాణ ప్రభుత్వం మరోసారి మద్యం రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ బాటిల్ పై రూ. నలభై వడ్డించారు. హాఫ్‌పై ఇరవై, క్వార్టర్ పై పది రూపాయల చొప్పున పెరుగుతాయి. ఇటీవల బీర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బీర్ల తయారీ కంపెనీలు తమకు నష్టాలు వస్తున్నాయని కమిషన్ పెంచాలని చేస్తున్న డిమాండ్ తో బీర్ల ధరలను పెంచారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం కోసం ఫుల్ బాటిల్‌కు రూ. నలభై చొప్పున వడ్డించారు.
తెలంగాణలో మద్యం ధరలు పెంచాలని చాలా కాలంగా ప్రభుత్వం అనుకుంటోంది. కానీ వివిధ కారణాలతో వాయిదాలు వేస్తూ పచ్చింది. ఇప్పుడు నిర్ణయం ప్రకటించారు. కరోనాకు ముందుతో పోలిస్తే మద్యం ధరలు దాదాపుగా రెట్టింపు అయ్యాయని మందుబాబులు అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత దుకాణాలు ప్రారంభించినప్పుడు ధరలను భారీగా పెంచారు. ఇప్పుడు మరోసారి పెంచారు.
తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయాన్ని బడ్జెట్లో భారీగా అంచనా వేసింది. ఇప్పుడున్నట్లుగా సాగితే ఆ అంచనాలను అందుకోవడం కష్టం. గతంలోలా ఇప్పుడు సరిహద్దు జిల్లాలలో ఆదాయం ఎక్కువగా రావడం లేదు. అందుకే ధరల పెంపు తప్ప మరో మార్గం లేదని అంచనాకు వచ్చారు. నిర్ణయాన్ని అమలు చేశారు.