తెలంగాణ రాజ్భవన్లో నాలుగు హార్డ్ డిస్కులు చోరీ కావడం సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు దొంగను పట్టుకునేవరకూ విషయాన్ని బయటకు రానివ్వలేదు. దొంగను పట్టుకుని హార్డ్ డిస్కులను రికవరీ చేసిన తర్వాత మీడియాకు లీక్ ఇచ్చారు.
రాజ్ భవన్ లో సుధర్మ భవన్ ఉంటుంది. అందులో రాజ్ భవన్ కు సంబంధించిన కంప్యూటర్ వ్యవస్థ ఉంటుంది. అక్కడ కాంట్రాక్ట్ పద్దతిలో శ్రీనివాస్ అనే ఇంజినీర్ పని చేస్తూంటాడు. పదమూడో తేదీన ఆయన ఇంజినీర్ హెల్మెట్ పెట్టుకుని సుధర్మ భవన్ లోకి వచ్చాడు. కంప్యూటర్లలో ఉన్న నాలుగు హార్డ్ డిస్కుల్ని తీసుకుని వెళ్లిపోయాడు. అవి ఎక్కడైనా స్పేర్ గా ఉన్నవి అయితే అవసరం వచ్చేదాకా తెలియకపోవచ్చు కానీ నేరుగా కంప్యూటర్లలోనివే తీసుకెళ్లడంతో వెంటనే గుర్తించారు.
రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. హై సెక్యూరిటీ ఉండే భవనంలో దొంగతనం అంటే.. చిన్న విషయం కాదు. ఇంటి దొంగల పనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఆ మేరకు సీన్ ఫుటేజీ.. ఇతర మార్గాల ద్వారా దర్యాప్తు చేశారు. చివరికి. హార్డ్ వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ దోపిడీ చేశాడని తేల్చారు. పోలీసులు పట్టుకున్నారు. డిస్కుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఏ ఉద్దేశంతో చోరీ చేశాడన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.