పవన్ కల్యాణ్ ఇప్పుడు జోడు గుర్రాల సవారీ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన చాలా ఎగ్రెసివ్‌గా పని చేస్తున్నారు. రాజకీయంగా ఆయనపై చాలా బాధ్యత ఉంది. అందుకే కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. పవన్ చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అసలు వస్తాయా, రావా? అనే డౌటు సగటు అభిమానుల్లో వుంది. వాటికి పవన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. కొంతకాలం సినిమాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించారు. ‘వీరమల్లు’కు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రమోషన్ కార్యక్రమాలూ మొదలయ్యాయి. ఇప్పుడు ‘ఓజీ’ మూడ్ లోకి వెళ్లిపోయారు. శనివారం నుంచి ముంబైలో ‘ఓజీ’ షూటింగ్ జరగబోతోందని, ఆ షూటింగ్ లో పవన్ పాలు పంచుకొంటారని సమాచారం. ఓజీకి కనీసం 10 నుంచి 12 రోజుల కాల్షీట్లు కావాలి. ఈసారి ‘ఓజీ’ షూటింగ్ ఏకధాటిగా జరబోతోందని, తన పార్ట్ అయ్యింతే వరకూ పవన్ సెట్లోనే ఉంటారని సమాచారం.
మరోవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కీ ఆయన డేట్లు ఇచ్చారు. పవన్ రాకకోసం హరీష్ శంకర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు మైత్రీ మూవీస్ ఓ పోస్టర్ విడుదల చేసింది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుందని ప్రకటించింది. దాంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పవన్‌ని ఇలా వరుసగా సినిమా షూటింగుల్లో చూడడం, ఆయన ఫోకస్ సినిమాలపై పడడం అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. పవన్ రాజకీయంగా బిజీనే. ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు. అయితే చేతిలో ఉన్న సినిమాలు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అభిమానుల కోసం, ఆయన్ని నమ్ముకొన్న నిర్మాతల కోసం పవన్ కొన్ని రోజులు షూటింగులకు అంకితం కావాల్సిందే. ఇప్పటికే ఆయా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల కోసమైనా పవన్ ఈ సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ‘ఉస్తాద్‌ని’ ఏకధాటిగా పూర్తి చేయడం కుదరదు. మధ్యమధ్యలో బ్రేక్‌లు తీసుకోవాల్సిందే. ఇక మీదట కనీసం నెలకు వారం నుంచి పది రోజులు `ఉస్తాద్`కు కేటాయించే అవకాశం ఉంది. ‘ఉస్తాద్’ తరవాత పవన్ పూర్తిగా సినిమాలకు దూరం అవుతారని ప్రచారం జరుగుతోంది. కానీ ‘ఉస్తాద్’ తరవాత పవన్ మరో సినిమా చేస్తారని ఇన్ సైడ్ వర్గాలు అంటున్నాయి.