కుంగుబాటుకు గురి అయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రమంగా పుంజుకునేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆర్థిక సంవత్సరం అయిన ఏప్రిల్ లో గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే మెరుగైన ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చింది. భారీగా పెరగకపోయినా.. స్వల్పంగా పెరిగినా ఇది సెంటిమెంట్ మెరుగుపడుతున్న సూచనలు కనిపించడానికి కారణం అవుతోంది.
2024 ఏప్రిల్ లో 1, 24, 157 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో వీటి సంఖ్య 1,42, 912గా నమోదు అయింది. అంటే.. దాదాపుగా పద్దెనిమిది వేల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రిజిస్టర్ అయ్యాయి. ఇది పెరుగుగుతున్న డిమాండ్ కు సంకేతంగా కనిపిస్తోంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సెకండ్ సేల్స్ కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. అత్యంత ఖరీదైన ఇళ్ల రిజిస్ట్రేషన్లలో మాత్రం అంత పెరుగుదల లేదు.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తోంది. త్వరలో మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. మరో వైపు ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ రంగం విషయంలో కాస్త ప్రోత్సాహకంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో హైదరాబాద్ రియల్ మళ్లీ వెలుగుల దిశగా వెళ్తోందన్న నమ్మకం పెరుగుతోంది.