ఒకటో తేదీ నుంచి సినిమా ధియేటర్లను మూసేస్తామని ఎగ్జిబిటర్లు ప్రకటించడంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు. హోంశాఖ కార్యదర్శికి ఆయన విచారణ చేయాలని కోరారు. ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులు ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కు దగ్గర పడిన సమయంలో ఇలా ధియేటర్ల సమస్యను తెరపైకి తేవడంలో నలుగురు కీలక పాత్ర పోషించారన్న స్పష్టమే సమాచారం.. సినిమాటోగ్రఫీ మంత్రికి చేరినట్లుగా తెలుస్తోంది.
ధియేటర్లు ఇప్పుడు ఎగ్జిబిటర్ల చేతుల్లో లేదనేది బహిరంగ రహస్యం. చాలా మంది ఒప్పందాల్లో ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలోని నలుగురు ప్రముఖుల చేతుల్లో వందల ధియేటర్లు ఉన్నాయి. ఎవరి గుప్పిట్లో పడకుండా సొంతంగా ధియేటర్లు నడిపించుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. వారికి సినిమాలు దొరకడం కష్టంగా మారడంతో చాలా మంది తమ ధియేటర్లను మాల్స్ గా లేకపోతే ఫంక్షన్ హాల్స్ గా మార్చుకుంటున్నారు. ధియేటర్లపై ఇప్పుడు నలుగురికి గుత్తాధిపత్యం ఉంది. వారే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా. అయినా ధియేటర్లకు రెంటల్స్, షేర్స్ అంటూ పాత వివాదాన్ని కొత్తగా తెరపైకి చ్చి ధియేటర్లు క్లోజ్ చేస్తామంటున్నారు.
టాలీవుడ్ సినిమా వ్యాపారం పూర్తిగా కొంత మంది గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కొత్తగా వచ్చే వారిని పీల్చి పిప్పి చేసి మరెవరూ అటు వైపు రాకుండా చేస్తున్నారు. తాము మాత్రమే సినిమాలు తీస్తామన్నట్లుగా ఉన్నారు. పాత వారు కూడా సినిమాలు తీయలేకపోతున్నారు. ఇలాంటి మాఫియా మధ్య ఇప్పుడు టాలీవుడ్ కూరుకుపోయింది. ధియేటర్లు ఆపేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకున్న నలుగురు.. తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకుంటున్నామన్న సంగతిని మరచిపోతున్నారు.
ఇప్పుడు ధియేటర్లు మూసేస్తే.. ఇక ప్రజలు ధియేటర్లు తెరిచినా రాకపోవచ్చు. ఓటీటీలకు ఇప్పటికే అలవాటుపడిపోయారు. ధియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే టెక్నాలజీ కూడా వచ్చేసింది. పవన్ పై కోపంతోనే.. పవన్ నిర్మాతలకు నష్టం చేయాలనో ధియేటర్లు మూసే కుట్ర చేస్తే.. మొత్తం ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది. తాము కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లుగా అవుతుంది.