బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై త్వరలోనే సస్పెన్షన్ వేటు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. ఏ క్షణమైనా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ఆయన..కేటీఆర్ ను కాకుండా జోగినపల్లి సంతోష్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయనున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ చుట్టూ ఉన్న దుయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలను సామ ఉటంకిస్తూ ఆ దయ్యాలు ఎవరో కాదు…సంతోష్ రావు, కేటీఆర్ , హరీష్ రావు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవితపై వేటు వేస్తే ఆమె సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని చెప్పారు. కేసీఆర్ తో కవిత భేటీ కాకుండా సంతోష్ రావు అడ్డుపడుతున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏం చేయాలో, ఎవర్ని కలవాలో సంతోష్ రావ్ నిర్ణయిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ను కలిసేందుకు వచ్చే ఎమ్మెల్యేల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇక, కవితతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ఆలోచన కేటీఆర్ చేయడం లేదని, ఆయన ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. కేసీఆర్ ను సొంత మనుషులే వెన్నుపోటు పొడుస్తారన్న సామ… ఆయన పరిస్థితి జయలలితగా మారిందన్నారు. కుటుంబం విచ్చిన్నం అవుతున్నా ఏమి మాట్లాడలేని నిస్సహాయుడిగా మారాడని చెప్పారు. గతంలోపార్టీ అంతర్గత విషయాలను బయటకు వచ్చి మాట్లాడితే చర్యలు తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నారన్నారు.