భారత రాష్ట్ర సమితిలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం క్రమంగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం పెరుగుతోంది. అదే సమయంలో కవితకు వ్యతిరేకంగా విశ్లేషణలు వస్తున్నాయి. కేసీఆర్ కుమార్తెగా తప్ప ఆమెకు ఎలాంటి గుర్తింపు లేదని..సొంత పార్టీ అంటూ పెడితే కార్పొరేటర్ గా కూడా గెలవలేరని ప్రో కేటీఆర్ సానుభూతిపరులు ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం విషయంలో కేసీఆర్ మౌనం పాటిస్తున్నారు. స్పందించవద్దని పార్టీ నేతలకు చెబుతున్నారు.
మౌన వ్యూహానికే ఓటేసిన కేసీఆర్
కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో మౌనానికి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఏదైనా పెద్ద సమస్యల వచ్చినప్పుడు ఆయన దాని గురించి పట్టనట్లే ఉంటారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని అనుకుంటారేమో కానీ మౌనాన్ని పాటిస్తారు. చివరికి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అందరూ అంగీకరించాల్సిన అవసరాన్ని కల్పిస్తారు. అయితే అది ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువగా జరిగింది. పార్టీ వ్యవహారాల్లో ఇలాంటి మౌనం వర్కవుట్ అవుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు కవిత విషయంలో కేసీఆర్ అదే మౌన వ్యూహం పాటిస్తున్నారు.
కవిత అంశంపై మాట్లాడవద్దని పార్టీ క్యాడర్ కు సంకేతాలు
కవిత అంశంపై కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులతో మాత్రమే ఈ అంశంపై మాట్లాడారు. వారిని కూడా బహిరంగంగా స్పందించవద్దని కేసీఆర్ సూచించారని చెబుతున్నారు. కవిత వ్యూహం ఏమిటో స్పష్టంగా ఇంకా తెలియనందున సైలెంటుగా ఉండటం మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కవితను పిలిపించి మాట్లాడే విషయంలోనూ కేసీఆర్ తటపటాయిస్తున్నారు. కవిత ఫామ్ హౌస్ కు వెళ్లలేదో..కేసీఆర్ నుంచి పిలుపు రాలేదో స్పష్టత లేదు. కేసీఆర్ ను కవిత కలిస్తే అదో రాజకీయ హైడ్రామా అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ దాన్ని కోరుకోవడం లేదని అనుకోవచ్చు.
మౌనం ఒక్కో సారి సమస్యను పెంచుతుంది !
రాజకీయంగా ఏర్పడే సమస్యలను వీలైనంత త్వరగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. వారేం చేస్తారో అని చూస్తూ కూర్చుకుంటే అసంతృప్తిలో ఉన్న వారిలో అసహనం పెరిగిపోతుంది. కేసీఆర్ కవిత విషయంలో వేచి చూడాలన్న అభిప్రాయంలో ఉంటే అది మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. కవిత సొంత పార్టీ పెట్టుకుంటే… సక్సెస్ కాలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ కు నష్టం జరుగుతంది. ఇప్పటికే పతనం దిశగా చాలా దూరం వెళ్లింది. పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లలో డిపాజిట్ రాలేదంటే..ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా ఘోరమైన పతనం దిశగా ఉన్నట్లే. ఇప్పుడు కవిత కూడా రెబల్ గా మారితే.. అది మరింత పతనానికి దారి తీస్తుంది. మరి కేసీఆర్ అటు పార్టీ.. ఇటు కుటుంబం.. ఇక కుమార్తె ….మధ్య బ్యాలెన్స్ చేసుకుని.. ఏ బంధమూ పగులకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అది సాధ్యమవుతుందా లేదా అన్నదే కీలకం.