తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. అందుకు కారణం హైకమాండ్ కాదు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే. పాలనపై మరింత పట్టు బిగించేందుకు తను సిఫార్స్ చేసిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని రేవంత్ కోరుతుండగా..సీనియర్లు అందుకు మోకాలడ్డుతుండటంతో ఈ కేబినేట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది.
ఇక , ఎట్టకేలకు ఈ నెల 30న మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయమని ఢిల్లీ పెద్దల లీకులతో ఇప్పుడు రేవంత్ – సీనియర్లు అని కాకుండా కొత్తగా కొంతమంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. మాదిగ సామజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని సమావేశం అయ్యారు. ఇందులో మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారున్నారు.
అయితే, ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహకు ఇప్పటికే కేబినేట్ లో చోటు దక్కింది. కానీ, ఆయన మాదిగ ఉప కులానికి చెందిన వారు కావడంతో, అసలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని ఈ భేటీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కు మంత్రి పదవి ఖాయమని లీకులతో.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు కేబినేట్ లో అవకాశం ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి పెంచే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనేది ఫిక్స్ అయింది. అధిష్టానం ఆమోదముద్ర వేయడమే ఆలస్యం. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి దక్కాలని ఎజెండాతో సమావేశాలు నిర్వహించినా ఫలితం ఎలా ఉంటుందో కానీ, మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేసిన వారౌతారని చెప్పడంలో సందేహం లేదు.