మాట్లాడితే జనం పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారో ఏమో.. వైసీపీ నేతలు పోట్లాటకు దిగుతున్నారు. అది కూడా పోలీసులతో తలపడుతూ సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. ఎప్పుడో ఎవరో ఒకరో అనుకుంటే ఏమో అనుకోవచ్చు.. అధినేత నుంచి అందరికందరూ అదే దారిపట్టడం, పోలీసులతో రెచ్చిపోయి మాట్లాడటం చేస్తున్నారు.
ఇటీవల విడదల రజిని తన పీఆర్వో శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తే వారితో వాగ్వాదానికి దిగారు. కారులో ఉన్న శ్రీకాంత్ ను తమకు అప్పగిస్తే వెళ్లిపోతామని పోలీసులు చెప్పినా ఆమె వినలేదు. పోలీసుల విధులకు ఆటంకం కల్గిస్తూ వారిని బెదిరిస్తూ కారు డోర్ కు అడ్డంగా నిల్చుండిపోయారు. ఆమె వైఖరిని చూసి వైసీపీ నేతలే ఆశ్చర్యపోయారు.
రజిని వ్యవహారం అలా ఉంచితే, జగన్ మరీ దారుణం. కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసిన గంజా బ్యాచ్ కు మద్దతు పలికారు. నేరస్తులను ఎలా శిక్షిస్తారు అంటూ వారిని పరామర్శించేందుకు తెనాలికి వెళ్లారు. ఆయన పరామర్శపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీనిపై భారీ వ్యతిరేకత వచ్చినా, వైసీపీ సోషల్ మీడియా ఎలివేషన్స్ ను చూసి జగన్ సంతృప్తి పడినట్టు ఉన్నారు.
మరో నేత అంబటి రాంబాబు వెన్నుపోటు దినం నిర్వహించే క్రమంలో పోలీసులతో గొడవ పడ్డారు. కలెక్టరేట్ లోకి పార్టీ నేతలతో కలిసి అంబటి వెళ్లేందుకు యత్నించగా సీఐ అడ్డుకున్నారు. అనుమతి లేదని మర్యాదగా చెప్పారు. కానీ, అక్కడ అంబటి.. మర్యాదగా చెప్తే వెంటాడా? సీఐ సీరియస్ గా చెప్పారు. అయినా పోలీసు అధికారికి అంబటి వేలు చూపిస్తూ రెచ్చిపోయారు. ఆయనపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఇలా ఒకరి తర్వాత ఒకరు పోలీసులతో గొడవ పడుతుండటంతో దీన్నే వైసీపీ నేతలు హీరోయిజంగా భావిస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.