Thug Life Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2/5
‘ఏ ఫిల్మ్ బై మణిరత్నం’
పోస్టర్ పై ఈ అక్షరాలు కనిపిస్తే చాలు, అద్భుతాలు చూడడం ఖాయమని ఆశ పడతాడు సగటు ప్రేక్షకుడు. ఎందుకంటే మణిరత్నం ఇచ్చిన సినిమాలు అలాంటివి. ఎప్పుడో 38 ఏళ్ల క్రితం వచ్చిన ‘నాయకుడు’ గురించి ఇప్పటికీ జనం మాట్లాడుకొంటూనే ఉంటారు. గీతాంజలి, రోజా, ఘర్షణ, దళపతి… ఒకటా రెండా? మణిరత్నం ఇచ్చిన మణిమాణిక్యాలెన్నో. మణిరత్నం సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టినా, వాటికి కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. ‘అమృత’ సినిమా సరిగా ఆడలేదు. కానీ ఆ సినిమాకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సినిమా చూశాక, సినిమా గురించి కంటే షాట్ మేకింగ్ గురించి, ఆ విజువల్ బ్యూటీ గురించి మాట్లాడుకొంటారు. అదీ మణి మ్యాజిక్. ఫ్లాపులకు దూరం అయిపోని ఫ్యాన్స్‌ని సంపాదించుకొన్న ఒకే ఒక్క దర్శకుడు. ‘నాయకుడు’ తరవాత ఇన్నేళ్లకు కమల్ హాసన్ తో సినిమా చేశారు. అదే ‘థగ్ లైఫ్’. మణిరత్నం అభిమానులు, కమల్ ని ఇష్టపడేవాళ్లు, వీరిద్దరి కాంబోని మళ్లీ చూడాలనుకొనేవాళ్లూ ‘థగ్ లైఫ్’ కోసం ఆశగా ఎదురు చూశారు. మరి ఈ సినిమా ఎలా వుంది? వాళ్లని ఏమేరకు అలరించింది?
రంగరాయ శక్తిరాజు (కమల్‌హాసన్) ఢిల్లీలో ఓ పెద్ద గ్యాంగ్ స్టార్. అమర్ (శింబు)ని చిన్నప్పటి నుంచీ తనే పెంచుకొంటుంటాడు. దానికీ ఓ కారణం ఉంది. శక్తి రాజు గ్యాంగ్ కీ, పోలీసులకూ మధ్య జరిగిన షూటవుట్ లో అమర్ తన తండ్రిని కోల్పోతాడు. చెల్లాయికి దూరం అవుతాడు. అమర్ ని అడ్డు పెట్టుకొనే శక్తి రాజు పోలీసుల నుంచి తప్పించుకొంటాడు. అందుకే అమర్ అంటే సానుభూతి. ‘నీ చెల్లాయిని ఎలాగైనా వెదికి తీసుకొస్తా’ అని అమర్‌కి మాట ఇస్తాడు. తన కన్నబిడ్డలా పెంచుకొంటాడు. శక్తిరాజుకు శత్రువులు పెరుగుతారు. ఇంట్లో అన్నయ్య (నాజర్) శక్తి ఆధిపత్యాన్ని సహించలేకపోతాడు. ఓసారి శక్తిపై దాడి జరుగుతుంది. దానికి అమర్ కారణమని అనుమానిస్తాడు శక్తిరాజు. ఈ చిన్న మిస్ కమ్యునికేషన్ని అడ్డం పెట్టుకొని శక్తిరాజుని పక్కకు జరపాలన్న కుతంత్రం మొదలవుతుంది. ఆ కుట్రలో అమర్ భాగం పంచుకొన్నాడా? ఆ తరవాత ఏమైంది? అనేదే అసలు కథ.
భారతీయ చలన చిత్రసీమకు గ్యాంగ్ స్టర్ సినిమా ఎలా ఉంటుందో రుచి చూపించిన దర్శకుడు మణిరత్నం. అది కూడా ‘నాయకుడు’ సినిమాతోనే. ఇప్పుడు మళ్లీ కమల్ తో సినిమా తీస్తూ, అదే గ్యాంగ్ స్టర్ డ్రామాని ఎంచుకొన్నాడు. ‘నాయకన్’లో ఓ అండర్ డాగ్ గ్యాంగ్ స్టర్ ఎలా అయ్యాడో చూపిస్తే, ఇందులో ఓ గ్యాంగ్ స్టర్ తన అంతర్గత కుట్రలకు ఎలా బలయ్యాడో ఆవిష్కరించారు. అయితే `నాయకుడు`లో ఉన్న మ్యాజిక్ ‘థగ్ లైఫ్’లో మిస్సవ్వడమే దురదృష్టకరం. కథగా కొత్తగా చెప్పింది లేదు. కొత్తగా చూపించింది లేదు. ప్రతీ అంగుళం ప్రేక్షకుడి ఆలోచనలకు అనుగుణంగానే సాగుతుంటుంది. రొటీన్ కథని మణి తనదైన మ్యాజిక్ జోడించి చెబితే ప్రేక్షకులు ఆ మాత్రమైనా సంతోష పడుదురు. కానీ.. రొటీన్ కథని, మరింత రొటీన్ గా తెరకెక్కించడం ప్రేక్షకుల్ని, మణి అభిమానుల్ని మరింత విస్మయ పరుస్తుంది.
సినిమా మొదలైన తొలి 10 నిమిషాల్లో మాత్రమే మణిసార్ కనిపిస్తారు. శింబు చైల్డ్ ఎపిసోడ్, పోలీసులతో జరిగిన షూటవుట్, `నీ చెల్లిని తిరిగి తీసుకొస్తా` అని కమల్ మాట ఇవ్వడం ఇవన్నీ ఇంపాక్ట్ ఫుల్ గా సాగిపోతాయి. కానీ ఆ తరవాత క్రమక్రమంగా కథ రొటీన్ ఫార్మెట్ లోకి వెళ్లిపోతుంది. ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలూ, చివరికి శక్తిరాజుని అంతా కలిసి టార్గెట్ చేయడం ఇలా ఒకొక్కటిగా జరుగుతుంటాయి. అభిరామి – కమల్ మధ్య జరిగే సన్నివేశాలు కాస్త బెటర్. ఆ ఓల్డ్ రొమాన్స్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ ఊహించిందే. అక్కడ్నంచి క్లైమాక్స్ వరకూ జరిగే తతంగం మరింత రొటీన్‌గా ఉంటుంది. ఏ కొశాన.. ఓ కొత్త సినిమా చూస్తున్నాం అనిపించదు. ఎంత విసిగించినా ‘ఇది మణిరత్నం సినిమా కదా’ అనే గౌవరంతో ‘శుభం’ కార్డ్ వరకూ కంటిన్యూ చేయాల్సివస్తుంది తప్ప, ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టగలిగే సరుకు ఈ సినిమాలో లేకుండా పోయింది.
గ్యాంగ్‌లో అంతర్గత కుమ్ములాటల్ని కూడా ఆసక్తికరంగా తెరకెక్కించొచ్చు. కాకపోతే బలమైన సన్నివేశాలు, సంఘటనలు కావాలి. అలా కావాలంటే క్యారెక్టర్లు బలంగా రాసుకోవాలి. ఈ విషయంలో మణి విఫలం అయ్యాడు. ప్రధాన పాత్రలతో సహా.. ఏ ఒక్క క్యారెక్టర్ ఆర్క్ సరిగా కుదర్లేదు. శింబు క్యారెక్టర్ కూడా అంతే. త్రిష పాత్ర అయితే మణి తన చిత్తాన రాసుకొంటూ వెళ్లాడు. తను శక్తి వైపు ఉందా? అమర్ వైపు ఉందా? అనేది చివరి వరకూ క్లూ లెస్‌గానే మిగిలిపోయింది. స్క్రీన్ ప్లేలోనే డొల్లతనం ఉంటే, ఇక సినిమా ఏం ముందుకు వెళ్తుంది? అన్నా చెల్లెళ్లు ఎప్పుడు కలుస్తారు? అసలు కలుస్తారా, లేదా? అనే పాయింట్ తో ఈ సినిమా మొదలవుతుంది. సగం సినిమా అయ్యేసరికి ఆ పాయింటే ప్రేక్షకులు మర్చిపోతారు. క్లైమాక్స్ లో మళ్లీ గుర్తు చేస్తాడు దర్శకుడు. ‘ఓహో.. ఇదొకటి ఉంది కదూ’ అనుకోవడం తప్ప ఆ ఎమోషన్ పై ప్రేక్షకుడికి సానుభూతి కలగదు.
కమల్ గొప్పగా నటిస్తాడు? అని ఎన్నిసార్లు చెప్పుకొంటాం? అది జగద్విదితం. ఈ సినిమాలోనూ తన ప్రమాణాలకు తగ్గట్టుగా చేసుకొంటూ వెళ్లిపోయారాయన. అభిరామితో వచ్చిన ప్రతీ సన్నివేశంలోనూ కమల్ లోని గొప్ప నటుడు బయటకు వస్తుంటాడు. శింబు ఎందుకో ఈ క్యారెక్టర్‌కు సూట్ కాలేదనిపిస్తుంది. తన లుక్ కూడా సరిగా లేదు. త్రిష పాత్రని సరిగా మలచలేకపోయాడు దర్శకుడు. అభిరామి పాత్ర మాత్రమే వెలిగింది. ప్రతీ పాత్రకూ పేరున్న నటుడ్నే తీసుకొన్నా బలమైన విలన్ లేడు.
రెహమాన్ నుంచి ఓ గుర్తుండిపోయే పాట వచ్చి చాలా కాలం అయ్యింది. మణిసార్ కూడా ఆయన్నుంచి అలాంటి పాట రాబట్టుకోలేకపోయాడు. నేపథ్య సంగీతంలో ఇంపాక్ట్ లేదు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. నిర్దాక్షణ్యంగా కట్ చేయాల్సిన సీన్లు, ట్రిమ్ చేయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఫొటోగ్రఫీ మాత్రం బాగుంది. అక్కడక్కడ మణి రత్నం షాట్ మేకింగ్ లో పెట్టిన శ్రద్ద కనిపిస్తుంది. తెలుగులో కొన్ని డైలాగులు బాగా పలికాయి. డబ్బింగ్ క్వాలిటీ ఉంది. మేకింగ్ లో ఎక్కడా రాజీ పడకపోయినా, రైటింగ్ విషయంలో మణి రాజీ పడిపోయారు. మణి సినిమాలు ఫ్లాప్ అయినా కొంత కాలానికి వాటికి కల్ట్ ఇమేజ్ వచ్చేస్తుంది. ‘థగ్ లైఫ్’కి మాత్రం కనీసం ఆ అవకాశాలు కూడా లేనట్టే కనిపిస్తున్నాయి.
తెలుగు360 రేటింగ్: 2/5