తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యల సెగకి అధ్యక్షుడిగా ఉన్న సునీల్ నారంగ్ పదవికి రాజీనామా చేయడం మరింత సంచలనంగా మారింది. నిజానికి శ్రీధర్ వ్యాఖ్యలలో తప్పుడు అంశం లేదు కానీ ఆ వ్యాఖ్యలు వెలువడిన తీరు, కమ్యూనికేషన్ స్టైల్ పరుషంగా ఉండటం, వ్యక్తిగతంగా ఎవ్వరినో టార్గెట్ చేసినట్టుగా మాటల వాడకం అతని మంచి ఉద్దేశాన్నే చెడుగా ప్రాజెక్ట్ చేసింది.
శ్రీధర్ లేవనెత్తిన హీరోల రెమ్యూనరేషన్ అంశం మాత్రం చాలా అవసరమైన చర్చనీయాంశం. ఈ అంశాన్ని వ్యక్తిగత స్థాయిలో కాకుండా, జనరలైజ్ చేసి చెప్పాల్సింది. కానీ ‘ఒక హీరో’ అని ప్రస్తావించడంతో అది వ్యక్తిగత దాడిగా మలుచుకుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోల రెమ్యూనరేషన్ లో గణనీయమైన మార్పులు అవసరం. మార్కెట్ డిమాండ్‌కు సంబంధం లేకుండా, కొంతమంది నిర్మాతలు హీరోలకు తమ ఇష్టానుసారంగా పారితోషికాలు చెల్లిస్తున్నారు. కాస్త క్రేజ్ ఉన్న హీరో డేట్స్ లభించగానే, వారు చెప్పినంత ఇచ్చేసేందుకు వెనకాడడం లేదు. ఈ స్థితిలో సినిమా బడ్జెట్ బలవంతంగా పెరిగిపోతోంది.
ఒక సినిమా మొత్తం ఖర్చులో సగానికి పైగా రెమ్యూనరేషన్‌కే వెళ్తోంది. నిజంగా బాక్సాఫీస్‌పై పట్టున్న కొద్ది మంది స్టార్లకు తప్ప, మిగిలిన వాళ్లకు ఇంత భారీ పారితోషికం ఎందుకన్న ప్రశ్నలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.
రెమ్యూనరేషన్ నిర్ణయించే ప్రక్రియ పూర్తిగా స్పష్టత లేకుండా మారిపోయింది. ఒకప్పటిలా గణాంకాలు, హిట్లు, ఫ్లాపులపై ఆధారపడి రెమ్యూనరేషన్ నిర్ణయించే యావరేజ్ విధానం కనబడటం లేదు. కొత్త హీరో ఓ హిట్ కొట్టిన వెంటనే డైరెక్టర్, మ్యూజిక్, కథ వంటి ఇతర కారణాలతో విజయం సాధించినా ఆ క్రెడిట్‌ను పూర్తిగా తన ఖాతాలో వేసుకొని రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. నిర్మాతలు కూడా దీనిని అడ్డు చెప్పకుండా అంగీకరిస్తుండటం చూస్తున్నాం.
ఇది కేవలం కొత్త హీరోలకే కాదు మీడియం రేంజ్, చిన్న హీరోల విషయంలోనూ అదే పరిస్థితి. సినిమా హిట్ అయితే ఎంత ఆదాయం వస్తుంది? ఫెయిల్ అయితే ఎంత నష్టం వస్తుంది? అన్న లెక్కలే వేసుకోకుండా పారితోషికాల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి గుడ్డినమ్మకాలతో నిర్మాతలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.
కంటెంట్ పైన కాకుండా హీరో క్రేజ్‌పైనే పెట్టుబడి పెడుతున్న ట్రెండ్ కారణంగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తగ్గిపోతున్నాయి. ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌తో నష్టాలనుంచి బయటపడిపోవచ్చన్న ఆశలు కూడా ఇప్పుడిక వర్కవుట్ కావడం లేదు. ఇవి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నాయి.
ఈ ట్రెండ్‌ని నియంత్రించకపోతే టాలీవుడ్‌కి బర్నౌట్ తప్పదు. రెమ్యూనరేషన్లు రీజనబుల్ గా ఉండాలి. శ్రీధర్ ఉద్దేశం కూడా ఇదే. కానీ ఆయన విషయాన్ని సరిగ్గా కమ్యునికేట్ చేయలేకపోయారు. ఒక సినిమా ఎంత లాభం తెస్తుందన్న కోణంతో కాకుండా, సినిమా పొతే ఎంత తక్కువ నష్టంతో బయటపడతామన్న కోణంలో నిర్మాతలు ఆలోచించాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది.