దర్శకుడు మారుతి ‘రాజాసాబ్’ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన కథలు ఇప్పుడు సినిమాలుగా మారబోతున్నాయి. మారుతి కథలతో గతంలోనే కొన్ని సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు మరిన్ని సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. మారుతి రాసిన ఆరు కథల్ని.. ఆరుగురు దర్శకుల చేతుల్లో పెట్టారు. ఆరుగురు దర్శకులు ఈ కథలకు స్క్రిప్టు రూపం ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. ఈ కథలు రెడీ అయ్యాక, హీరోల వేట మొదలవుతుంది. ఆ తరవాత సెట్స్ పైకి వెళ్తాయి. ఈ సినిమాలకు మారుతి కథకుడిగానే ఉంటారు. నిర్మాతలు వేరు.
మారుతి స్వతహాగా మంచి రచయిత. చాలా వేగంగా స్క్రిప్టు పూర్తి చేయగలరు. కాబట్టి కథలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ తెరపై చూసుకోవాలన్న ఆలోచనతోనే తన కథల్ని బయట దర్శకుల చేతుల్లో పెడుతున్నారు. ఈమధ్య హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్లు ఈ కథల్ని తెరపైకి తీసుకెళ్లబోతున్నారు. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి.
‘రాజాసాబ్’ అయ్యాక ఏ హీరోతో సినిమా చేయాలన్న విషయంలో మారుతి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి మెగా హీరోతో చరణ్ సినిమా తీసే అవకాశం ఉంది. ‘రాజాసాబ్ 2’ ఆలోచన ఉన్నప్పటికీ, అది ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేదు. మధ్యలో మరో సినిమా చేశాకే…పార్ట్ 2 ఉంటుంది.