రాజకీయాలు దిగజారిపోతున్నాయని ప్రతి ఒక్కరూ అంటారు. ప్రజలు కూడా అంటారు. కాలంతో మారితే కొంత వరకూ సరే వైపరీత్యాలు తప్పడం లేదని అనుకోవచ్చు కానీ.. ప్రళయాలు తీసుకొచ్చే రాజకీయాల పార్టీలకు, ఆయా పార్టీల నేతలకు మాత్రం బుద్ది చెప్పాల్సిందే. ఈ విషయంలో ప్రజలే మరింత చైతన్యవంతంగా ఉండాలి. అలాంటి రాజకీయ నేతలకు ఎప్పటికప్పుడు బుద్ది చెప్పాలి . లేకపోతే రాజకీయాల్ని, జీవితాల్ని రౌడీల పరంగా చేసుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది.
నేర రాజకీయాలను తరిమికొట్టాలి !
రాజకీయం అంటే పవర్. ఆ అధికారం అందిన వాడు దుర్మార్గుడు, నేర మనస్థత్వం ఉన్నవాడు, దోచుకునే స్వభావం ఉన్న వాడు అయితే ప్రజల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారుతుంది. ప్రజల్ని బిచ్చగాళ్లుగా మార్చి ఓటు బ్యాంకులుగా ఉంచుకుని మిగతా సంపద అంతా తమ ఖాతాల్లో వేసుకుంటారు. ఐదు సంవత్సరాల పాటు జరిగింది అదే. ప్రజలు తెలుసుకున్నారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును అర్థం చేసుకోలేని రాజకీయ నాయకుడు మాత్రం ఇంకా రెచ్చిపోతున్నారు. ప్రజలపై వెన్నుపోటు దినాలు జరిపి.. రౌడీలతో మీ సంగతి తేలుస్తానని వస్తున్నారు. ఆయనకు బుద్ది చెప్పాల్సిన అవసరాన్ని మరోసారి కల్పిస్తున్నారు.
పావులుగా వాడుకుంటున్న వారి పట్ల పేదలు అప్రమత్తంగా ఉండాలి !
వేల కోట్లు దోచుకున్న ఇలాంటి రాజకీయ నేతలు.. నిరుపేదల్ని పావులుగా వాడుకుంటూ ఉంటారు. కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో చూస్తే సులువుగా అర్థమైపోతుంది. ఆ పార్టీకి పావులుగా ఉపయోగించుకునేది ఇలాంటి కుటుంబాలనే. అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు ఏమీ చేయకపోయినా.. పనుల్లేకుండా చేసి.. ఓ పదివేలు ఇచ్చి.. బానిసగా పడి ఉండాలన్నట్లుగా బ్రెయిన్ వాష్ చేస్తారు. అలాగే వాడుకుంటారు. అలాంటి వారి పట్ల ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి. వారి రాజకీయ వ్యూహాల్లో చిక్కుకునేందుకు.. వారి బలప్రదర్శనల కోసం బలయ్యేందుకు అవకాశం ఇవ్వకూడదు.
కార్యకర్తల్ని బలి చేసే పార్టీ ఉంటే ఎంత.. లేకపోతే ఎంత ?
కార్యకర్తలు, అభిమానుల్ని ఏ పార్టీ అయినా గౌరవంగా చూసుకుంటుంది. వారిని బలి చేసి.. ఆ తప్పిదాలను ఇతరులపై రుద్దేసి తాము రాజకీయం చేయాలనుకునే పార్టీలు చాలా అరుదుగా ఉంటాయి. కోడి కత్తి శీను, పోస్టర్ రవితేజ.. ఇప్పుడు సింగయ్య సహా ఎంతో మంది కార్యకర్తల్ని ఆ పార్టీ బలి తీసుకుంది. జగన్ రెడ్డి తన అక్రమార్జన కోసం వందల మందిని జైళ్లకు పంపుతున్నారు. అంతా అయ్యాక.. వారితో నాకేం సంబంధం అంటున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. రాజకీయంగా వారికి ఎలాంటి ఆదరణ ఉండని .. ప్రజలు తెలియ చెప్పాల్సిన సమయం వచ్చింది. అలా చేస్తేనే రాజకీయాల్లో సంస్కరణ సాధ్యమవుతుంది.