ఈమధ్య ఓటీటీ సంస్థలు బాగా తెలివి మీరిపోయాయి. సినిమాలు కొనడం లేదు. విడుదలకు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేయడం చాలా కష్టంగా మారింది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ ‘తమ్ముడు’ నాన్ థియేట్రికల్ రైట్స్ కి మంచి బేరం కుదిరింది. ‘తమ్ముడు’ ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకొంది. సాధారణంగా దిల్ రాజు బ్యానర్లో వచ్చే సినిమాల్ని అమేజాన్కి అమ్ముతారు. అయితే తొలిసారి నెట్ ఫ్లిక్స్ గడప తొక్కింది దిల్ రాజు సంస్థ.
సినిమాని చూపించే మరీ ఓటీటీ డీల్ క్లోజ్ చేశార్ట. శాటిలైట్ ని స్టార్ మా సొంతం చేసుకొంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.38 కోట్లు వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాపై దాదాపు రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 37 కోట్లు థియేటర్ల నుంచి రావాలి. ఇటీవల నితిన్ కు వరుస ఫ్లాపులు చుట్టుముట్టాయి. ఎన్నో ఆశలు పెట్టుకొన్న ‘రాబిన్ వుడ్’ బాగా నిరాశ పరిచింది. ‘తమ్ముడు’ కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇలాంటి దశలోనూ నాన్ థియేట్రికల్ రైట్స్ పేరిట మంచి వ్యాపారమే చేసిందీ సినిమా. వేణు శ్రీరామ్ ట్రాక్ రికార్డ్ బాగుండడం, దిల్ రాజు సంస్థ కావడంతో ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఓకే అనిపించుకొంది. ఈనెల 28న రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రమోషన్లను కూడా కొత్తగా చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఈవారం నుంచే ‘తమ్ముడు’ పబ్లిసిటీ పనులు మొదలైపోవొచ్చు.