బనకచర్ల వివాదంతో ఏపీపై, చంద్రబాబుపై విషం చిమ్మి.. తెలంగాణ ప్రజల మనసుల్లో మళ్లీ విద్వేష బీజాలు నాటి.. బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసుకుందామని గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. మంచి ఒరేటర్ అయిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో తెలంగాణ ప్రజల ముందు కీలక విషయాలు ఉంచుతున్నారు. తప్పు ఎవరిదో స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటామన్న గట్టి సందేశం ఇస్తున్నారు.
కేసీఆర్, హరీష్ సంతకాల వల్లే తెలంగాణకు అన్యాయం
రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణ జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ , హరీష్ రావు సంతకాలు చేశారని.. ఇదే తెలంగాణకు మరణశాసనం అయిందని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇది రికార్డెడ్ అంశం. ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేకపోతోంది. అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తోంది. కానీ నిజం ఏమిటో చెప్పడం లేదు. కృష్ణా నదిలోని మొత్తం 811 టీఎంసీ నీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీ, తెలంగాణకు 299 టీఎంసీ కేటాయించారు. 1976లో బచావత్ ట్రిబ్యునల్ల్ ద్వారా ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీ నీటి ఆధారంగా జరిగింది.
తాత్కాలికం అని ఇప్పుడు వాదిస్తున్న కేసీఆర్,హరీష్
కేసీఆర్ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుని ఇప్పుడు తాత్కలికంగానే చేసుకున్నామని సమర్థించుకుంటోంది. 299 టీఎంసీ కేటాయింపును తాత్కాలికమైనదిగా భావిస్తూ, కృష్ణా నది బేసిన్లో 68.5 శాతం క్యాచ్మెంట్ ప్రాంతం తెలంగాణలో ఉన్నందున, సుమారు 555 టీఎంసీ నీటిని కేటాయించాలని ప్రజలు ఇలా ఎలా ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించే సమయంలో వాదనను బయటకు తీసుకు వచ్చారు. అసలు అన్యాయం చేసిన వాళ్లే ఇప్పుడు మళ్లీ జల వివాదాలతో రాజకీయం చేయడం ఏమిటన్న ప్రశ్నను రేవంత్ రెడ్డి తీసుకు వస్తున్నారు.
గోదావరిలోనూ కేసీఆర్ నిర్లక్ష్యమే !
అటు కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయం అయినా.. ఇటు గోదావరి నీటిని ఏపీ బనకచర్ల ద్వారా తరలించుకుందామన్న ప్రయత్నం చేసినా అదంతా కేసీఆర్ వల్లే జరుగుతోందని రేవంత్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.కేసీఆర్ గతంలో రోజా ఇంటికి వెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. గోదావరి నీటిని రాయలసీమ తరలించేందుకు సహకరిస్తామన్నారు. ఇప్పుడు అదే కేసీఆర్, హరీష్ రావు.. అడ్డగోలు రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వాటిని రేవంత్ పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ .. అవసరం లేని అంశాలతో ఎదురుదాడి చేస్తోంది కానీ.. ప్రజలు సూటిగా.. సుత్తిలేకుండా.. గతంలో చేసిన పనులకు వివరణ అడుగుతున్నారు. బీఆర్ఎస్ వాటికి సమాధానం చెప్పాల్సిన ఉంది.