అక్రమ మైనింగ్ కేసుల్లో వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వంతో పాటు సీతామహాలక్ష్మి అనే బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ రద్దు చేసే అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో వంశీ విడుదలకు మార్గం సుగమం అయింది. అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో సాయంత్రంలోపు ష్యూరిటీలు సమర్పించి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఫిబ్రవరి పదమూడో తేదీ నుంచి వంశీ జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్న సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసిన కేసులో ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత వరుసగా చాలా కేసులు తెరపైకి వచ్చాయి. అన్నింటిలోనూ పీటీ వారెంట్లు అమలు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో పీటీ వారెంట్ అమలు చేయక ముందే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీన్ని రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఊరట లభించినట్లయింది.
అయితే వంశీ చేసిన అక్రమ మైనింగ్ పూర్తి వివరాలు సీల్డ్ కవర్ లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచరాణను వాయిదా వేసింది. సీతామహాలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సివిల్ కేసును .. క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారని ప్రశ్నించింది. మొత్తంగా వంశీ బెయిల్ పోరాటం ముగిసినట్లే. ఆయన విడుదలయ్యే ఆవకాశం ఉంది.