తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాల విషయంలో భారీ ప్రకటనలు వచ్చాయి.దాంతో చాలా మంది రియల్ ఎస్టేట్ కు మంచి రోజులు వస్తాయనుకున్నారు. మెట్రో విస్తరణ ప్రణాళికలు నగరాన్ని మరింత విస్తరిస్తాయనుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్.. హైదరాబాద్ నగర్ శివారు ప్రాంతాల్ని మరో అరవై కిలోమీటర్లకు పొడిగిస్తుందని అనుకున్నారు. ఫోర్త్ సిటీ లాంటి ప్రాజెక్టు మరో సైబరాబాద్ అవుతుందనుకున్నారు. అయితే ఏడాదిన్నర తర్వాత కూడా వాటిలో కదలిక లేకపోవడం రియల్ ఎస్టేట్ వర్గాలను నిరాశ పరుస్తోంది.
ఫోర్త్ సిటీ గురించి సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నప్పుడు.. ఆ ప్రాంతంలో రియల్ భూమ్ కనిపించింది. ఎక్కడ చూసినా ఫోర్త్ సిటీ వద్ద ప్లాట్లు అమ్మబడును అనే ప్రకటనలు కనిపించేవి. సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అసలు ఎలాంటి ప్రకటనలు లేవు. అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక మెట్రో విస్తరణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఫోర్త్ సిటీ వరకూ.. హయత్ నగర్ వరకు.. పటాన్ చెరు వరకూ ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు కేంద్రం నుంచి ఆమోదం రాలేదు. రాష్ట్రం వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటో స్పష్టత లేదు.
ఇక రీజినల్ రింగ్ రోడ్ కథ సాగుతోంది. ఉత్తర భాగం టెండర్లు పిలిచారు కానీ.. ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఖరారు చేయలేకపోయారు. భూసేకరణ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడంలోనూ సమస్యలు ఉన్నాయి. దక్షిణ భాగం టెండర్ల గురించి స్పష్టత లేదు. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఎక్కడివక్కడే ఉండటంతో రియల్ ఎస్టేట్ ముందుకు సాగడం లేదు. డిమాండ్ పెరగడంలేదు. వీటి పనులు సాగుతూంటే.. ఆయా ప్రాంతాల వైపు బూమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.