పవన్ కల్యాణ్ – ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేసింది. 3 నిమిషాల కట్ ఇది. డైలాగులు, యాక్షన్, హీరోయిజం, పవనిజం కలగలిపి చూపించేశారు. విజువల్ గా ట్రైలర్ బాగుంది. కొన్ని డైలాగులు కూడా ఆకట్టుకొంటాయి. ముఖ్యంగా ‘ఆంధీ వచ్చేసింది’ అనే డైలాగ్ తో టీజర్ కట్ చేయడం బాగుంది. ప్రధాని మోడీ పవన్ ను ‘ఆంధీ’ అని సంభోదించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆంధీ అంటే తుపాను అని అర్థం. అలా ఈ ట్రైలర్‌ని, వీరమల్లుని తుపానుతో పోల్చారన్నమాట.
”హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం
ఈదేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం
ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకొంటున్న సమయం”
– అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పవన్ ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పాలనుకొంటున్నాడన్న వార్తలకు ఇదే తాత్కాణం. ఈ సినిమాలో హిందుత్వం కూడా ప్రధాన భాగం కానున్నదని ఈ డైలాగ్ తో అర్థమైపోతుంది.
”ఇప్పటి దాకా మేకల్ని వేటాడే పులిని చూసి ఉంటారు
ఇప్పుడు పులిల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు”
”నేను రావాలని చాలామంది దేవుడికి దండం పెట్టుకొంటూ ఉంటారు.
కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు..”
డైలాగులు కూడా పవన్ అభిమానులకు నచ్చేవే.
‘ఎవరదీ.. ఎవరదీ.. అతగాడో పొడుపు కథ’ – అనే పాటని బ్యాక్ గ్రౌండ్ లో వాడుకొన్నారు కీరవాణి. ఆయన ఆర్.ఆర్ గురించి ప్రత్యేకంగ చెప్పుకోవాలి. వీరమల్లుకు కీరవాణి అదనపు అడ్వాంటేజ్ కాబోతున్నారు.
‘నువ్వు మా వెర్రి విస్సన్న మావయ్య కదూ’ అనే డైలాగ్ కూడా ఈ ట్రైలర్ లో ఉంది. దీనికేమైనా పొలిటికల్ గా అర్థాలున్నాయా? అంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకొంటున్నారు.
మొత్తానికి ‘వీరమల్లు’ టీజర్ ఫ్యాన్స్ కి నచ్చేలా వుంది. కాకపోతే… వీఎఫ్ఎక్స్ పై ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. కొన్ని చోట్ల ఎఫెక్ట్స్ బాగానే ఉన్నా, కొన్ని చోట్ల తేలిపోయాయి. బిగ్ స్క్రీన్ లో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గా కనిపిస్తే, ఫ్యాన్స్ మిగిలిన విషయాలేం పట్టించుకోరు. కాబట్టి.. అదేం పెద్ద సమస్య కాకపోవొచ్చు.