నెల్లూరు జిల్లాలో ఉన్న కరేడు గ్రామంలో ఇండోసోల్ ప్రాజెక్టు కోసం భూసేకరణ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. అక్కడి ప్రజలు ఎవరూ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. కనీసం వైసీపీ సానుభూతిపరులు కూడా ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆ కంపెనీపై ఎవరికీ నమ్మకం లేదు. ఈ కారణంగా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే సేవ్ కరేడు పేరుతో ప్రజల ఉద్యమం ప్రారంభించారు. వారికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది.
పంటలు పండే భూముల్ని సేకరించే ప్రయత్నం
శిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఇండోసోల్ . సోలారు ప్యానల్స్ ఉత్పత్తి, సోలార్ ప్లాంట్లను నిర్మిస్తామని ముందుకు పచ్చిది. వైసీపీ హయాంలో వచ్చిన ప్రతిపాదన. ఇప్పటికే రామాయపట్నం వద్ద సుమారు 5,147 ఎకరాలు కేటాయించారు. కొత్తగా కరేడు గ్రామంలో 8,300-8,500 ఎకరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ భూముల సమీకరణకు స్థానిక రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఫలవంతమైన వ్యవసాయ భూములను సమీకరించడం వల్ల స్థానిక రైతుల జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉందని.. తాము భూములు ఇచ్చేది లేదని అంటున్నారు.
ప్రభుత్వం రైతుల మాట వినాల్సిందే !
భూమి ఇవ్వలేము అన్న వారి నుంచి ప్రైవేటు సంస్థ కోసం భూములు సేకరించడం మంచిది కాదు. వారు ఒప్పుకుంటే మాత్రమే.. పరిశ్రమలకు భూములు కేటాయిచాలి. అది కూడా రైతుల నుంచి సేకరించాలి అంటే మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇండోసోల్ కంపెనీని కరేడు ప్రజలు నమ్మకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ సంస్థకు ఆర్థిక సామర్థ్యం లేదు. అంతకు మించి అది జగన్ రెడ్డి బినామీ కంపెనీగా పేరు ఉంది. వస్తున్న పెట్టుబడులను వెనక్కి పంపడం ఎందుకు అని.. చంద్రబాబు కొనసాగిస్తున్నారు కానీ.. దీని వల్ల చెడ్డపేరు వస్తోంది. పారిశ్రామిక రంగంపై ఎలాంటి ముద్ర పడకూడదని ఆయన వీటిని కొనసాగించేందుకు అంగీకరించారు.దీని వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.
వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదు ?
వ్యక్తిగత వివాదాలతో ఎవరైనా తన్నుకుంటే సీసీ ఫుటేజీని పోస్టు చేసి.. తీవ్ర విమర్శలు చేసే వైసీపీ.. కరేడు గ్రామంలో జరుగుతున్న ఉద్యమం గురించి మాత్రం మాట్లాడటం లేదు. వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే అది వారి బినామీ కంపెనీ. తమ బినామీకి వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వం సేకరించి ఇస్తుందని వారు అనుకుంటేూ ఉంటే ఇంకెందుకు నోరు మెదుపుతారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. నిజంగా ప్రాజెక్టు పెట్టే సామర్థ్యం ఉంటే.. ఇండోసోల్‌ను నిరుపయోగ భూముల్లో పెట్టాలి. బలవంతపు భూసేకరణ చేయడం ఆపేయాలి. కుదిరిదే అసలు ఇండోసోల్ పెట్టుబడుల ప్రతిపాదనల్ని కూడా హోల్డ్‌లో పెట్టాలి. ఇది సామాన్యుడి అభిప్రాయం.