కలర్ ఫోటో తర్వాత సుహాస్ కి మళ్లీ అలాంటి సక్సెస్ రాలేదు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట .. ఇవన్నీ యావరేజుల దగ్గర ఆగిపోయాయి. సుహాస్ నటించిన ‘ఉప్పుకప్పురంబు’ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో ఇటీవలే విడుదలైంది. ఇప్పుడు ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా వస్తోంది. మాళవిక మనోజ్ హీరోయిన్. రామ్ గోధల దర్శకుడు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కాస్త వెరైటీగానే ఉంది. కథ రివీల్ చేయకుండానే కామెడీ, ఎమోషన్, లవ్ స్టోరీ.. చాలా కోణాల్లో నడిపారు.
ట్రైలర్లో చాలా సన్నివేశాలు సినిమా షూటింగుల చుట్టూ తిరిగాయి. క్లాప్‌తో మొదలైన ట్రైలర్.. సుహాస్ యాక్షన్ చెప్పడంతో ఫినిష్ అయింది. మధ్యలో హరీష్ శంకర్, మారుతి లాంటి దర్శకులు కూడా కనిపించారు. హరీష్ శంకర్ ఓ డైలాగ్ కూడా చెప్పారు. ఈ సినిమాలో మరికొంతమంది స్టార్లు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇదొక దర్శకుడి కథని అర్థమౌతోంది. దీనితో పాటు ఇంకొన్ని లేయర్స్ కనిపించాయి. లవ్ స్టోరీ, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఫ్రెష్‌గా అనిపించాయి. సుహాస్ ఎప్పటిలానే నేచురల్‌గా కనిపించాడు. కెమెరా వర్క్, మ్యూజిక్ డీసెంట్‌గా ఉన్నాయి. దర్శకుడు ఏదో కొత్త పాయింట్‌తోనే వచ్చాడని అర్థమౌతోంది.
చిన్న సినిమా ఆడాలంటే ఖచ్చితంగా కొత్తదనం ఉండాల్సిందే. ట్రైలర్లో ఆసక్తి కనిపిస్తేనే ప్రేక్షకుల దృష్టిపడుతుంది. ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేలానే ఉంది. ఈ నెల 11న సినిమా రిలీజ్ కానుంది.