ప్రజాస్వామ్య దేవాలయం చట్టసభలు. చట్టాలు చేసేది అక్కడే. చర్చలు జరిగేది అక్కడే. అక్కడ జరిగేదే రికార్డెడ్. మిగతావి ఎక్కడ ఏం జరిగినా లెక్కలోకి రావు. అందుకే విపక్ష పార్టీలు అధికార పార్టీల్ని మొదటగా చేసే డిమాండ్.. అసెంబ్లీని సమావేశపర్చమని. ఏదైనా సమస్య వస్తే అసెంబ్లీని పెట్టాలని .. చర్చిద్దామని డిమాండ్ చేస్తారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్ అదే. ఇతర విపక్షాలు కూడా అదే డిమాండ్ చేశాయి. పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. పెట్టారా లేదా అన్నది తర్వాత సంగతి విపక్షాలు చేసే పని అది. కానీ తెలంగాణ, ఏపీలో ఏం జరుగుతోంది. అసెంబ్లీ పెడతాం రావాలని అధికార పార్టీ సవాల్ చేస్తూ.. విపక్షాలు ప్రెస్ క్లబ్ కు వస్తామని అంటున్నాయి. విపక్షాలు అసెంబ్లీ అంటే భయపడటం వింత పరిస్థితే.
బనకచర్లపై అసెంబ్లీలో చర్చ – బీఆర్ఎస్కు ఎందుకు భయం?
నీటి ప్రాజెక్టులు మొత్తం మీద అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ పదే పదే పిలుపునిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపించడం లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావడం లేదు. ఆయనే వస్తే అన్ని చర్చిద్దామంటున్నారు. కేసీఆర్ స్థాయి రేవంత్ కు లేదని కేటీఆర్ అంటున్నారు. తప్పించుకోవడానికి ఇది చెప్పినట్లుగా ఉంది. వ్యక్తుల పరంగా ఎవరూ పోరాడటం లేదు. ప్రజలు ఇచ్చిన ప్రజాస్వామ్యంలో సీఎం రేవంత్.. ప్రతిపక్ష నేత కేసీఆర్. ఎవరి స్థాయి ఏమిటో ప్రజలు ఇచ్చారు. వారికిచ్చిన రోల్స్ పాటిస్తారా లేదా అన్నది కీలకం. కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజలు ఇచ్చిన పాత్రను దూరం చేశారు. ఇప్పుడు రేవంత్ కి స్థాయి లేదని తప్పించుకుంటున్నారు. కానీ ఏదో తప్పు చేశారని అది బయటపడుతుందనే అసెంబ్లీకి వెళ్లడం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది.
ఏపీలో వైసీపీకి అసలు లెక్కే లేదు !
అధికార అహంకారంతో ఐదు సంవత్సరాల పాటు అసెంబ్లీని సొంత జాగీరుగా నడిపించుకుని విపక్ష నేతలపై అత్యంత ఘోరంగా దాడులు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని జగన్ రెడ్డి ..తానే కాదు..తన ఎమ్మెల్యేలను పోనివ్వడం లేదు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది.. అసెంబ్లీకి వెళ్లడానికి. ప్రతిపక్ష నేత కూడా ప్రజలే ఇవ్వలేదు. దాన్ని కారణంగా చూపి ఎగ్గొడుతున్నారు. అనర్హతా వేటు వేస్తారని.. గవర్నర్ ప్రసంగం రోజున ఒక్క పదకొండు నిమిషాలు వెళ్లి వచ్చారు. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయ వ్యూహాలు ఆ పార్టీకే సొంతం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని.., ప్రజల్ని లెక్క చేయని రాజకీయం వారికే సాధ్యం.
ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించాలి !
రాజకీయాల్లో స్థాయిలు అనేవి ప్రజలు ఇచ్చేవే. తాము వ్యక్తిగతంగా సాధించామని ఎవరైనా అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదు. ఓ ముఖ్యమంత్రిగా చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా.. సామాన్య ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్నట్లుగా చేసుకుని పేరును బీఆర్ఎస్గా మార్చుకుని కేసీఆర్ పార్టీ దెబ్బతిన్నది. ఈ రెండు పార్టీలు ఇప్పటికీ ప్రజాస్వామ్య విలువలు, ప్రజల్ని గౌరవించడం నేర్చుకోకపోతే… ప్రజలు కూడా వాటి గురించి మర్చిపోయే అవకాశం ఉంది.