మంత్రి పదవిపై దానం నాగేందర్ మరోసారి గురి పెట్టారు. నిన్నా మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని ఆయన హైడ్రా సహా వివిధ అంశాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున బీఆర్ఎస్కు సవాళ్లు విసురుతున్నారు. జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్ ను గెలిపిస్తానని అంటున్నారు. రేవంత్ ఢిల్లీ వెళ్లడంతో దానం కూడా వెళ్లారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక బాధ్యతను తాను తీసుకుంటానని .. గెలిపిస్తానని మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ప్రతిపాదన పెట్టనున్నట్లుగా చెబుతున్నారు.
దానం నాగేందర్‌కు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. గతంలో ఆయన జూబ్లిహిల్స్ నుంచే పోటీ చేయాలనుకున్నారు. కానీ పీజేఆర్ తనయుడు జూబ్లిహిల్స్ కోరుకోవడంతో ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. దానంగా జూబ్లిహిల్స్ లో అనుచరగణం ఉంది. అందుకే ఈ ఉపఎన్నికను మంత్రి పదవి కోసం అడ్వాంటేజ్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి జూబ్లిహిల్స్ ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గలేదని నిరూపించుకోవడమే కాదు.. బీఆర్ఎస్ పని అయిపోయిందని తేల్చేలా ఉపఎన్నిక ఫలితాన్ని సాధించాల్సి ఉంది. అందుకే రేవంత్ రెడ్డి కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఎలాంటి చాయిస్ తీసుకునే చాన్స్ లేదు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా జూబ్లిహిల్స్ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్నారు. గెలిచి తీరాల్సిందేనని దిశానిర్దేశం చేశారు.
జూబ్లిహిల్ బాధ్యతను దానం నాగేందర్ కు ఇస్తే.. ఖచ్చితంగా ఆయన తనదైన మార్క్ చూపించే అవకాశం ఉంది. ముస్లిం వర్గాల్లోనూ దానంకు మంచి పట్టు ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు దగ్గరకు వచ్చినప్పటికీ ఓడిపోయిన దానం…ఇప్పుడు జూబ్లిహిల్స్ చాన్స్‌ను వదులుకునే అవకాశం లేదు. నిజంగానే ఆయనకు బాధ్యతలిస్తే.. మంత్రి పదవి కోసం ఏం చేసైనా గెలిపించేందుకు దానం ప్రయత్నిస్తారనడంలో సందేహం ఉండదు.