ఒకప్పుడు మెగా ఫోన్ పట్టినవాళ్లంతా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలనే అనుకొనేవారు. అలానే ఈతరం దృష్టంతా ప్రభాస్ పై పడింది. ప్రభాస్‌కి ఉన్న ఇమేజ్ అలాంటిది. పాన్ ఇండియా గోడలు దాటేసిన క్రేజ్ ప్రభాస్ సొంతం. అందుకే ప్రభాస్ ని దృష్టిలో ఉంచుకొని కథలు రాసుకొంటున్న దర్శకుల సంఖ్య పెరుగుతూ పోతోంది. తాజాగా బుచ్చిబాబు కూడా ప్రభాస్ ని టార్గెట్ చేశాడని తెలుస్తోంది. ప్రభాస్ తో కలిసి పని చేయాలని బుచ్చిబాబు ఉవ్వీళ్లూరుతున్నాడని, ఆయన కోసం ఓ కథ రెడీ చేస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘ఉప్పెన’తో తన మార్క్ చూపించేశాడు బుచ్చిబాబు. ఇప్పుడు రామ్ చరణ్ తో రూపొందిస్తున్న ‘పెద్ది’ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలోని ప్రమోషన్ కంటెంట్ ఆకట్టుకొంటోంది. ఇది ష్యూర్ షాట్ హిట్ అని ఇండస్ట్రీ అప్పుడే డిసైడ్ అయిపోతోంది. మరి బుచ్చిబాబు తదుపరి స్టెప్ ఎవరితో..? అనే డౌటు రాక మానదు. బుచ్చి కథ చెబుతానంటే పెద్ద హీరోలంతా వినడానికి రెడీనే. ఓ దశలో బుచ్చిబాబు మహేష్ కి టచ్‌లో ఉన్నాడన్న వార్తలొచ్చాయి. కాకపోతే.. ‘వారణాసి’ తరవాత మహేష్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఊహించలేం. అయితే బుచ్చి మనసులో మాత్రం ప్రభాస్ ఉన్నాడట. ప్రభాస్ కి సరిపడా ఓ కథని బుచ్చి రెడీ చేశాడని, ప్రభాస్ ని కలిసే అవకాశం వస్తే, కథ చెప్పడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ‘పెద్ది’ హిట్ అయితే.. ప్రభాస్ నుంచి పిలుపు రావడం పెద్ద కష్టమేం కాదు. అప్పుడు రాచమార్గంలోనే అప్పాయింట్ మెంట్ దొరుకుతుంది. సో.. ‘పెద్ది’ ని విజయతీరాలకు చేర్చేంత వరకూ బుచ్చి ఎదురు చూడాల్సిందే.
ప్రభాస్ – సుకుమార్ కాంబో గురించి కూడా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ లైనప్ చూస్తే.. ప్రభాస్ వరకూ వెళ్లడానికి కాస్త టైమ్ పట్టేట్టు కనిపిస్తోంది. ఈలోగా శిష్యుడే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొనే అవకాశం ఉంది.
