అసెంబ్లీలో చర్చ పెడతామని రేవంత్ రెడ్డి సవాళ్లు చేస్తూంటే కేటీఆర్ ప్రెస్ క్లబ్ రాజకీయం చేయడం విచిత్రంగా మారింది. బనకచర్ల కానీ.. ప్రాజెక్టుల కేటాయింపులపై కానీ చర్చిద్దాం రావాలని సవాల్ చేస్తోంది సీఎం రేవంత్ రెడ్డినే. ఆయన వేరే ప్లేస్కు రావాలని ఏమీ పిలుపునివ్వడం లేదు. అసెంబ్లీకే రావాలంటున్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు.. కేటీఆర్, హరీష్ రావులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందరికీ యాక్సెస్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన చట్టసభల్లో చర్చకు మించిన ఆప్షన్ మరొకటి ఉండదు.
సాధారణంగా ప్రతిపక్ష నేతలు.. ఏదైనా అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే.. అసెంబ్లీ సమావేశాలకు డిమాండ్ చేస్తూంటారు. కానీ విచిత్రంగా తెలంగాణలో మాత్రం అధికారపక్షమే.. అసెంబ్లీ సమావేశాలు పెడతాం రావాలని ప్రతిపక్షాన్ని డిమాండ్ చేస్తోంది. కానీ ప్రతిపక్షం మాత్రం అసెంబ్లీలో కాదు ప్రెస్ క్లబ్లో తేల్చుకుందామని సవాల్ చేస్తోంది. ఇది కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది. అయినా ఈ రాజకీయానికే బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తోంది.
ఇదంతా ఓకే కానీ రేపు అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు సిద్ధపడకపోతే ప్రజలు బీఆర్ఎస్ తప్పు చేసిందన్న అభిప్రాయానికి వస్తారు. అది ఆ పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికే కృష్ణా జలాల ఒప్పందంలో 299 టీఎంసీలకు మాత్రమే అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం చేసిన విషయాన్ని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారంలోకి పెట్టింది. రాయలసీమను రతనాల సీమ చేస్తానని గోదావరి నీటిని తరలించేందుకు అంగీకరించినట్లుగా గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనలను ప్రభుత్వం హైలెట్ చేసింది. వీటన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ బయటపెడుతుంది. అక్కడ చర్చ లో బీఆర్ఎస్ పాల్గొనక తప్పదు.