హైదరాబాద్‌లో హౌసింగ్ రియల్ ఎస్టేట్ డల్ గా ఉందని చెబుతున్నారు. అనుకున్నంతగా వృద్ధి లేదని బాధపడుతున్నారు కానీ ఆఫీస్ లీజింగ్ లో మాత్రం.. హైదరాబాద్ దూసుకెళ్తోంది. దేశంలోని హాట్ ప్రాపర్టీగా మారుతోంది. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ దేశంలోని 8 ప్రధాన నగరాలలో అత్యధికంగా ఉందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. 2024లో, హైదరాబాద్‌లో 12.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్ ఆఫీస్ స్టాక్ మూడు రెట్లు పెరిగి, 2024 డిసెంబర్ నాటికి 137 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. 2030 నాటికి ఈ స్టాక్ 200 మిలియన్ చదరపు అడుగులను దాటుతుందని CBRE, HYSEA నివేదిక అంచనా వేశాయి.
టెక్నాలజీ సెక్టార్ ఆఫీస్ లీజింగ్‌లో 30-35 శాతం వాటాను కలిగి ఉండగా, 2024లో ఇతర రంగాలు కూడా హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌ను పెంచాయి. లైఫ్ సైన్సెస్ రంగం 21 శాతం వాటాతో, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు 14 శాతం వాటాతో హైదరాబాద్ ఓన్లీ టెక్ కాదని నిరూపించారు. టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, ఫైనాన్స్ వంటి రంగాలలో గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.
హైదరాబాద్ GCC లీజింగ్‌లో బెంగళూరు తర్వాత రెండవ స్థానంలో ఉంది. 2024లో GCCలు 5.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజ్ కు తీసుకున్నాయి. హైదరాబాద్ బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాలెంట్ ఈకోసిస్టమ్ దీనిని గ్లోబల్ బిజినెస్ , టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నాయి. హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ బలమైన డిమాండ్, విభిన్న సెక్టార్లు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల ఆకర్షణతో దేశంలో అగ్రగామిగా నిలుస్తోంది. హై శాలరీ ఉద్యోగాలు పెరిగితే ఆటోమేటిక్ గా హౌసింగ్ రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. ఇది కూడా హైదరాబాద్ హౌసింగ్ రియల్ ఎస్టేట్ కు మంచి సూచికే అనుకోవచ్చు.