ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అగ్రనేతల పరిస్థితి ఇప్పుడు అత్యంత ఘోరంగా మారింది. ఒకప్పుడు అధికార బలంతో విర్రవీగిన అంబటి రాంబాబు, జోగి రమేష్ , పేర్ని నాని వంటి వారు నేడు కనీసం తమ ఇంటి గడప దాటలేని స్థితిలో ఉన్నారు. అంబటి రాంబాబు ఇంట్లో పోలీసులు ఉన్నప్పుడు పట్టుమని పదిమంది కార్యకర్తలు కూడా మద్దతుగా రాకపోవడం ఆ పార్టీ క్యాడర్ ఏ స్థాయిలో నీరుగారిపోయిందో చెప్తోంది. బూతులు మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా తాము నాయకుడి దృష్టిలో పడతామని భావించిన వీరికి, కష్టం వచ్చినప్పుడు మాత్రం పార్టీ నుంచి కనీస సహకారం అందలేదు.
వ్యూహం పార్టీది – బలయ్యేది లీడర్స్
వైసీపీలో విధేయతకు దక్కే బహుమానం కేవలం అవమానమేనని ఇప్పటికే పలువురు నేతలకు అర్థమైపోయింది. కల్తీ మద్యం కేసులో జైలుకు వెళ్లిన నేతను కనీసం పలకరించే తీరిక కూడా జగన్కు లేకపోయింది. చివరకు జైలు నుంచి విడుదలయ్యాక, సదరు నేతే స్వయంగా వెళ్లి జగన్ దర్శనం చేసుకోవాల్సి రావడం ఆ పార్టీలోని బానిసత్వానికి పరాకాష్ట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక నేతల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అవసరానికి వాడుకోవడం, పని అయిపోయాక కరివేపాకులా తీసి పక్కన పెట్టడం అనే కార్పొరేట్ రాజకీయం ఇక్కడ రాజ్యమేలుతోంది. నేతలు జైలు గోడల మధ్య మగ్గుతుంటే, అధినేత మాత్రం ప్యాలెస్ గోడల మధ్య ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నారు.
వాలంటీర్ల కంటే ఘోరమైన బతుకులు!
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను రాజకీయ అవసరాలకు వాడుకుని రోడ్డున పడేసిన జగన్, ఇప్పుడు తన సొంత పార్టీ నేతలను కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. బూతులు మాట్లాడితేనే పదవులు, గుర్తింపు దక్కుతాయనే భ్రమలో ఉన్న నేతలు.. ఆ భాష వల్లే ప్రజల్లో చీదరింపుకు గురవుతున్నారు. వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టి పార్టీ కోసం తిట్లు తింటున్నా, కనీసం నైతిక మద్దతు ఇచ్చే నాథుడు లేకపోవడం వైసీపీ నేతల దుస్థితికి అద్దం పడుతోంది. వాలంటీర్లకైనా కనీసం గుర్తింపు ఉండేదేమో కానీ, ఈ కాలకేయ నేతలకు మాత్రం సొంత పార్టీలోనే గౌరవం లేని పరిస్థితి నెలకొంది.
ఇంకా ఆ పార్టీలో ఎందుకు?
ఇన్ని అవమానాలు, ఇంతటి నిర్లక్ష్యం ఎదురవుతున్నా ఇంకా ఆ పార్టీలో కొనసాగడం అంటే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. తప్పు చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, కాపాడే వారు లేక, కనీసం ఓదార్చే వారు లేక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఈ నేతలు తమ భవిష్యత్తుపై పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాడుకుని వదిలేసే సంస్కృతి ఉన్న చోట విధేయత చూపడం అంటే, తమ రాజకీయ జీవితాన్ని తామే చేజేతులా సమాధి చేసుకోవడమే. సిగ్గులేని ఈ బానిస బతుకుల కంటే, స్వతంత్రంగా ఉండటమే మేలనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జగన్ రెడ్డి రాజకీయాన్ని నమ్ముకుని ఆయన వెంట నడిచిన వారు బాగుపడిన చరిత్ర లేదు. ఆ విషయం గుర్తు తెచ్చుకుంటే.. వైసీపీ నేతలకు తమకు ఓ క్లారిటీ వస్తుంది.
