విజయసాయిరెడ్డికి లిక్కర్ కేసులో సీఐడీ సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం సిట్ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్ లో ఓ సారి విజయసాయిరెడ్డిని పిలిచి ప్రశ్నించింది. ఆ సమయంలో తాను విజిల్ బ్లోయర్నని ఈ స్కాంలో తనకు తెలిసినవన్నీ చెబుతానని అన్నారు. అయితే జగన్ రెడ్డి పాత్ర లేదని అంతా రాజ్ కేసిరెడ్డి చేశారని చెబుతూ వస్తున్నారు. సిట్ మాత్రం విజయసాయిరెడ్డి పాత్రను స్పష్టంగా చెబుతోంది. ఆయనను ఈ స్కాంలో ఏ 5గా చేర్చింది.
లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి చెప్పాల్సింది చాలా ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. గతంలో విజయసాయిరెడ్డిని వైసీపీ అధినేత జగన్.. చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. అప్పుడు తనను రెచ్చగొడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఆ తర్వాత రెండు వర్గాలు సైలెంట్ అయ్యాయి. విజయసాయిరెడ్డిపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానేశారు.
విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన తర్వాత లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలువుర్ని అరెస్టు చేశారు. వారంతా జైళ్లలో ఉన్నారు. వారు చెప్పిన సమాచారం, లభించిన సాక్ష్యాల ఆధారంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నారు. ఎంత బుకాయించిన విజయసాయిరెడ్డికి లిక్కర్ స్కాంలో కీలక పాత్ర ఉందని స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తే మిగతా వారిలా అరెస్టు అవుతారు. ముందుగా చెప్పుకున్నట్లుగా విజిల్ బ్లోయర్ గా పూర్తి వివరాలు ఇస్తే.. అప్రూవర్ గా మారే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బయటపడవచ్చు. విజయసాయిరెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.