వైసీపీ నేతలు మైకుల ముందు పులులు.. తేడా వస్తే పిల్లులు అని నిరూపిస్తున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి , చెవిరెడ్డి లాంటి వాళ్లు ఎక్కడికీ పోను.. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని సవాళ్లు చేస్తారు..తీరా అరెస్టు చేయడానికి వస్తే పరార్ అయిపోయి కోర్టుల్లో పిటిషన్లు వేస్తారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అలాగే ఉన్నారు. ఆయన మీడియా ముందు .. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని సవాల్ చేశారు. అలా సవాల్ చేస్తున్న సమయంలోనే ఆయన తరపున హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అత్యంత ఘోరమైన మాటలు మాట్లాడారు. ఓ మహిళను అనకూడని మాటలన్నీ అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. మహిళా లోకం మండిపడింది. పోలీసులకు ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయింది. తన వ్యాఖ్యలను సమర్థించుకున్న.. ఆయన జైలుకెళ్లడానికి సిద్ధమేనన్నారు. కేసులు నమోదు కావడంతో జైలుకు పంపుతారన్న భయంతో వెంటనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
తాను ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని..అంతా ప్రజాస్వామ్య భాషే వాడానని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆయన అన్న మాటల్ని న్యాయమూర్తి వింటే ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ కాదు కదా.. అలాంటి మాటలు వినిపించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అలాంటి మాటలు మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి.. బయటకు మాత్రం.. రెచ్చిపోతున్నారు. వైసీపీ నేతల వ్యవహారం చూస్తే.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనే పద్దతిని ఫాలో అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.