ఒకప్పుడు సంచలన సినిమాలు తీసే దర్శకుడు శంకర్.. ఇప్పుడు సంచలనమైన డిజాస్టర్లు తీస్తున్నారు. ఆయన సినిమాలు యావరేజ్ తో కూడా బయటపడటం లేదు. దారుణమైన అపజయాలు. నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు కుదేలైపోయే సినిమాలు ఆయన నుంచి వస్తున్నాయి. ఇండియన్ 2, గేమ్ చేంజర్ ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో అందరికీ తెలుసు. ఆయన చివరి హిట్ రోబో. తర్వాత మళ్ళీ ఆయన నుంచి నిఖార్సయిన సినిమా రాలేదు.
ఇలాంటి సందర్భంలో శంకర్ తన డ్రీం ప్రాజెక్ట్ ప్రకటించారు. ‘వేల్పారి’ నవల ఆధారంగా సినిమా చేయబోతున్నారు శంకర్. ‘‘ఒకప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో. ఇప్పుడు వేల్పారి. భారీ బడ్జెట్‌తో, ఇప్పటివరకు చేయని పెద్ద స్కేల్ లో ఈ సినిమా ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ వంటి చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీ ఈ సినిమా కోసం వాడతా’’ అని ప్రకటించారు శంకర్.
మొత్తానికి శంకర్ మరో పెద్ద కలని నిజం చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం కేజీఎఫ్ ఫేం యష్‌ని హీరోగా అనుకుంటున్నారని సమాచారం. బాలీవుడ్ నుంచి కూడా కొన్ని ఆప్షన్లు చూస్తున్నారు. ఎవరైన సరే, శంకర్ ఇప్పుడున్న ఫామ్ నమ్మి సినిమా చేయడం అంటే బ్లైండ్ బెట్ గానే చూడాలి.
శంకర్ ప్రతిభ మీద ఎవరికీ అనుమానాలు లేవు. కానీ ట్రెండ్ కి సరిపడా అప్డేట్ కాలేదని ఆయన గత సినిమాల కథనాలు చూస్తే అర్థమౌతుంది. పైగా నవలతో సినిమా అంటే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. పొన్నియన్ సెల్వన్ తీసిన మణిరత్నం లాంటి దర్శకులే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు శంకర్ ఇలాంటి ఓ ప్రయత్నం చేస్తున్నారు. తన రీసెంట్ సక్సెస్ మీద కాకుండా శంకర్ బ్రాండ్‌ని బ్లైండ్‌గా నమ్మే హీరోలు కావాలి. మరి శంకర్ కల నెరవేర్చే హీరో ఎవరో చూడాలి.